చంద్రబాబు జైలుకు...ఏపీ టిడిపి దుకాణం బంద్‌: బిజెపి

రెండు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఘోరంగా ఓడిపోయినప్పటికీ, కేంద్రంలో నరేంద్రమోడీ నాయకత్వంలో బిజెపి భారీ మెజార్టీతో మళ్ళీ అధికారంలోకి రావడంతో రాష్ట్ర బిజెపి నేతల వాయిస్ బాగా పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. గత ఐదేళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల పట్ల మెతక వైఖరితో వ్యవహరించడం వలన, బిజెపికి ఏమీ లాభం కలుగలేదు కానీ తీవ్రంగా నష్టపోయింది. ఇది గ్రహించిన బిజెపి అధిష్టానం, కేంద్రప్రభుత్వం రెండూ కూడా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో తమ రాజకీయ వైఖరిని పూర్తిగా మార్చుకొని, అధికారంలో ఉన్న తెరాస, వైసీపీలకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని గట్టిగా నిర్ణయించుకున్నందునే, రాష్ట్ర బిజెపి నేతల స్వరంలో కూడా మార్పు వచ్చినట్లు భావించవచ్చు. 

బిజెపి జాతీయ కార్యదర్శి, ఏపీ బిజెపి వ్యవహారాల సహ ఇన్-ఛార్జ్ సునీల్ దియోధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “ త్వరలోనే టిడిపి అధినేత చంద్రబాబునాయుడు జైలుకు వెళ్ళడం ఖాయం. ఆయనతో పాటు అవినీతికి పాల్పడిన మరికొందరు టిడిపి నేతలు కూడా జైలుకు వెళ్ళడం ఖాయం. ఏపీ ప్రజలు టిడిపిని తిరస్కరించడంతో 23మంది టిడిపి ఎమ్మెల్యేలలో 18 మంది మాతో టచ్చులో ఉన్నారు. మా పార్టీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారు,” అని అన్నారు. 

సునీల్ దియోధర్ చెప్పిన ఈ మాటలు ఏపీలో బిజెపి బలపడాలనుకొంటున్నట్లు సూచిస్తున్నాయి. ఒకవేళ ఆయన చెప్పినట్లు చంద్రబాబునాయుడు నిజంగా జైలుకి పంపించి, 18 మంది టిడిపి ఎమ్మెల్యేలను బిజెపిలో చేర్చుకుంటే ఏపీలో కూడా టిడిపి దుకాణం బంద్‌ కావచ్చు.