నటుడు శివాజీ అరెస్ట్

తెలుగు సినీ నటుడు శివాజీని సైబరాబాద్‌ పోలీసులు ఈరోజు ఉదయం అరెస్ట్ చేశారు. టీవీ9-అలంద మీడియా కేసులో నిందితుడిగా పేర్కొనబడిన శివాజీని విచారణకు హాజరుకావాలని పోలీసులు కోరినప్పటికీ ఆయన స్పందించకుండా ఇంతకాలం అజ్ఞాతంలో గడిపారు. దాంతో ఆయన దేశం విడిచి పారిపోకుండా అడ్డుకునేందుకు పోలీసులు లుక్-అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈరోజు తెలవారుజామున ఆయన శంషాబాద్ విమానాశ్రయం నుంచి అమెరికా బయలుదేరుతుండగా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆయనను సైబరాబాద్‌ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 

ఇదే కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొనబడిన టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ ఇప్పటికే పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు శివాజీని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కనుక త్వరలోనే ఆయనను కూడా ప్రశ్నించబోతున్నారు. వారిరువురూ కలిసి నకిలీ పత్రాలు సృష్టించి టీవీ-9 మీడియాను కొనుగోలుచేసిన అలందా మీడియా సంస్థను మోసగించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.