
గత 5 రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ముంబై మహానగరంలో జనజీవనం స్తంభించిపోయింది. స్థానిక రైల్వే స్టేషన్లలో పట్టాలపైకి భారీగా వర్షపునీరు చేరడంతో ముంబై నగరానికి జీవనాడి వంటి లోకల్ రైళ్ళు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వెళ్ళే రైళ్ళు కూడా రద్దు అవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దేశఆర్ధిక రాజధానిగా కీర్తించబడే ముంబై మహానగరంలో రోడ్లన్నీ చెరువులను తలపిస్తుండటంతో బస్సులు, వాహనాలు తిరగడంలేదు. భారీ వర్షాల కారణంగా నిన్న ఒక్కరోజే ముంబైకి రాకపోకలు సాగించవలసిన 52 విమానాలు రద్దు అయ్యాయంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. మరొక మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పినందున స్కూళ్ళు, కాలేజీలకు శలవులు ప్రకటించారు. ఎంతో అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ళలో నుంచి బయటకు రావద్దని ప్రభుత్వం హెచ్చరించడంతో జనాలు ఇళ్లకే పరిమితమయ్యారు. దాంతో అనేక ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, దుకాణాలు, మార్కెట్లు బోసిపోయాయి.
ఈ భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు 32 మంది చనిపోయారు. మహారాష్ట్రలో పలు జిల్లాలలో వరదలు కూడా ప్రారంభం అయ్యాయి. వరద ధాటికి మంగళవారం రత్నగిరి జిల్లాలోని చిప్లన్ మండలంలో గల తివారీ డ్యామ్‌కు గండి పడటంతో దిగువన గల 7 గ్రామాలు నీట మునిగాయి. వరద ప్రవాహంలో 20 మందికి పైగా గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడకు చేరుకొని సహాయచర్యలు చేపట్టాయి. గ్రామాలలోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి గల్లంతైనవారి కోసం గాలింపు మొదలుపెట్టాయి. అతికష్టం మీద ఇద్దరి శవాలను వెలికితీయగలిగాయి. సింధు దుర్గ్ అనే మరో ప్రాంతంలో 20-22 మంది వరదలలో కొట్టుకుపోయారు. వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వారం రోజుల క్రితం వరకు చుక్క నీటికోసం అల్లాడిన మహారాష్ట్రను ఇప్పుడు వరదలు ముంచెత్తుతున్నాయి.