రాష్ట్రంలో మున్సిపల్ బోర్డుల పదవీకాలం నేటితో పూర్తి

రాష్ట్రంలో 68 మున్సిపాలిటీ పాలకమండలుల పదవీకాలం మంగళవారంతో ముగియడంతో రేపటి నుంచి ప్రత్యేకాధికారులు వాటి బాధ్యత స్వీకరించనున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తయి మళ్ళీ కొత్త పాలకమండలులు ఏర్పాటయ్యే వరకు వారే అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తారు. 

రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్‌, గ్రేటర్ వరంగల్‌తో పాటు ఖమ్మంలో రెండు, అచ్చం పేట, సిద్ధిపేట మున్సిపాలిటీల పదవీకాలం ఇంకా ఉన్నందున అవి యధావిధంగా పనిచేస్తుంటాయి. 

కొత్తగా ఏర్పాటుచేసిన కొన్ని మున్సిపాలిటీలకు ఇంకా ఎన్నికలు నిర్వహించవలసి ఉంది కనుక వాటిని ఏర్పాటు చేసినప్పటి నుంచి వాటి బాధ్యతలు చూసుకొంటున్న ప్రత్యేకాధికారులే ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు కొనసాగుతారు. ఏ కారణం చేతైనా ప్రత్యేకాధికారులను నియమించలేని మున్సిపాలిటీలను కమీషనర్లు ఇన్-ఛార్జ్ గా వ్యవహరిస్తారు. 

నేటితో మున్సిపాలిటీల పాలకమండలుల పదవీకాలం పూర్తిచేసుకున్న సభ్యులను అధికారులు ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ నెల 14వ తేదీ తరువాత ఎప్పుడైనా మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణ కోసం మున్సిపల్ అధికారులు, ఉద్యోగులు అవసరమైన పనులు చకచకా పూర్తిచేస్తున్నారు.