
రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఇవాళ్ళ సచివాలయం సందర్శించి, సిఎం కేసీఆర్పై విమర్శలు గుప్పించడంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘాటుగా స్పందించారు. “కాంగ్రెస్ నేతలు కేవలం పబ్లిసిటీ కోసమే సచివాలయం సందర్శనకు వచ్చారు తప్ప వారికి దానిపై ఏమాత్రం ఆసక్తి లేదు. ఉండి ఉంటే నాలుగైదు గంటలసేపు సచివాలయంలో అన్ని బ్లాకులలో తిరిగి వాటి పరిస్థితిని చూసి తెలుసుకునే ప్రయత్నం చేసేవారు. కొత్త రాష్ట్రం కోసం కోసం కొత్త సచివాలయం, శాసనసభ భవనాలను నిర్మిస్తే తప్పేమిటి? మన సచివాలయం, శాసనసభ దేశంలోకెల్లా అత్యుత్తమంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే సిఎం కేసీఆర్ ఈ ప్రతిపాదన చేశారు తప్ప వాటిని తన కోసం కట్టుకోవడం లేదు. ప్రభుత్వం అవసరాల కోసమే కట్టించాలనుకొంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు అవునన్నా కాదన్నా కొత్త సచివాలయం, శాసనసభ భవనాలను మా ప్రభుత్వం నిర్మించి తీరుతుంది. రాష్ట్రభివృధ్దిని వ్యతిరేకించే కాంగ్రెస్ నేతల సలహాలు మాకు అవసరం లేదు,” అని అన్నారు.