సిర్పూర్ తెరాస ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కోనేరు కృష్ణారావు నిన్న ఒక మహిళా అటవీశాఖాధికారిపై దాడి చేసి గాయపరిచినందుకు పోలీసులు అతనిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఈ కేసు నుంచి తన సోదరుడిని బయటపడేసేందుకు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప స్థానిక గిరిజనులను తన క్యాంప్ కార్యాలయానికి రప్పించుకొని, పోలీసులకు, మీడియాకు ఏవిధంగా చెప్పాలో బ్రీఫింగ్ ఇచ్చారు. తమ భూములలోకి వెళ్ళనీయకుండా అటవీశాఖ అధికారులు అడ్డుపడి తమను చితకబాదుతున్నారని, నిన్న కూడా అటవీఅధికారులు తమపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తే ఆత్మరక్షణ కోసం ప్రయత్నించాము తప్ప ఉద్దేశ్యపూర్వకంగా ఎవరిపై దాడి చేయలేదని చెప్పాలని కోనేరు కోనప్ప వారికి చెప్పారు. అయితే పోలీసులు, మీడియాతో ఏవిధంగా మాట్లాడాలో ఆయన వారికి బ్రీఫింగ్ ఇస్తున్నప్పుడు, అక్కడే ఉన్న ఎవరో ఒక వ్యక్తి దానిని తన మొబైల్ కెమెరాలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో అది పోలీసుల దృష్టికి కూడా వెళ్లింది. ఆ బ్రీఫింగ్ వీడియోను ఎస్పీ మల్లారెడ్డి కూడా చూశారు. ఈకేసులో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ఎవరు ప్రయత్నించినా ఉపేక్షించబోమని హెచ్చరించారు.
మహిళా అటవీశాఖాధికారిపై దాడి చేసి గాయపరిచినందుకు కృష్ణారావుపై తక్షణమే చర్యలు తీసుకున్న సిఎం కేసీఆర్, ఇప్పుడు అతనిని కాపాడేందుకు ప్రయత్నిస్తూ దొరికిపోయిన ఎమ్మెల్యే కోనేరు కోనప్పపై కూడా చర్యలు తీసుకుంటారా లేదో చూడాలి.