కాగజ్ నగర్‌లో మహిళా అధికారిపై ఎమ్మెల్యే సోదరుడు దాడి

సిర్పూర్ తెరాస ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కోనేరు కృష్ణారావు, ఆయన అనుచరులు తమ ప్రాంతంలో మొక్కలు నాటడానికి వచ్చిన మహిళా అటవీ అధికారిణిపై కర్రలతో విచక్షణ రహితంగా దాడిచేయడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సిఎం కేసీఆర్‌ దృష్టికి రావడంతో ఆయన వెంటనే ఎమ్మెల్యే కోనప్పకు ఫోన్ చేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణారావును తక్షణమే తన జెడ్పీటీసీ సభ్యత్వానికి, వైస్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయించాలని ఆదేశించడంతో రాజీనామా చేయవలసి వచ్చింది. 

అటవీశాఖ అధికారిణిపై దాడికి పాల్పడిన కృష్ణారావును, ఆయన అనుచరులను అరెస్ట్ చేసి కేసులు నమోదు చేయవలసిందిగా సిఎం కేసీఆర్‌ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతును, డిజిపి మహేందర్ రెడ్డిని ఆదేశించడంతో పోలీసులు కృష్ణారావును అరెస్ట్ చేశారు. 

అటవీశాఖ అధికారిణిపై కృష్ణారావు, అనుచరులు దాడికి పాల్పడుతున్నప్పుడు, ఆమెకు రక్షణగా వచ్చిన 15 మంది పోలీసులు, సబ్-ఇన్స్పెక్టర్ వారిని అడ్డుకొనే ప్రయత్నం చేయనందుకు, కాగజ్ నగర్ రూరల్ సీఐ వెంకటేశాన్ని సస్పెండ్ చేస్తూ డీఎస్పీ సాంబయ్య ఉత్తర్వులు జారీ చేశారు. 

ఈ సంఘటన ఆదివారం ఉదయం కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలో కొత్త సార్సాల గ్రామంలో జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో తొలగించబడిన చెట్లకు బదులుగా మళ్ళీ పచ్చదనం పెంచేందుకు కొత్త సార్సాల గ్రామ పరిధిలో గల అటవీభూములలో మొక్కలు నాటాలని అటవీశాఖ నిర్ణయించింది. ఆదివారం ఉదయం ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి అనిత, అటవీ శాఖ సిబ్బందితో కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళి ట్రాక్టర్లతో భూమిని చదును చేయబోతుంటే, వివాదాస్పద భూమిలో మొక్కలు వేస్తున్నారంటూ వారిని కృష్ణారావు అనుచరులు అడ్డుకున్నారు. 

వారిని పోలీసులు అడ్డుకోవడంతో కృష్ణారావు వచ్చి వారిని విడిపించి, అనితపై కర్రతో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆ దాడిలో ఆమె తలకు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెతో వచ్చిన అటవీశాఖ సిబ్బందికి కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ సమాచారం అందుకున్న కాగజ్ నగర్ డీఎస్పీ సాంబయ్య తక్షణమే అధనపు బలగాలను అక్కడికి పంపించి, అనితనుఅటవీశాఖ సిబ్బందిని వారి బారి నుంచి కాపాడి ఆసుపత్రికి తరలింపజేయడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. 

ఈ ఘటనపై సిఎం కేసీఆర్‌ కూడా వెంటనే స్పందించడం అభినందనీయం. గతంలో ఏపీలో మహిళా తహశీల్దార్ వనజాక్షిపై టిడిపి ఎమ్మెల్యే చింతమనేని దాడి చేసినప్పుడు, అప్పటి సిఎం చంద్రబాబునాయుడు ఎమ్మెల్యేను వెనకేసుకువచ్చి ‘వనజాక్షి అత్యుత్సాహం ప్రదర్శించిందంటూ’ ఆమెనే తప్పు పట్టారు. కానీ సిఎం కేసీఆర్‌ తక్షణమే కృష్ణారావుపై కటినమైన చర్యలు తీసుకుని, అధికారులపై సొంత పార్టీ నేతలు దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.