.jpg)
శుక్రవారం ప్రగతి భవన్లో జరిగిన సమావేశంలో విభజన సమస్యలపై చర్చించి పరిష్కరించాలని ఏపీ, తెలంగాణ అధికారులను ముఖ్యమంత్రులు కెసిఆర్, జగన్ ఆదేశించడంతో నేడు ఇరు రాష్ట్రాల అధికారులు ప్రగతి భవన్లో మరోసారి సమావేశం కానున్నారు. ఈరోజు సమావేశంలో రెండు రాష్ట్రాల ప్రధానకార్యదర్శులు, వివిదశాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారు.
ఈరోజు జరుగబోయే సమావేశంలో రెండు రాష్ట్రాల విద్యుత్ సంస్థల మద్య నెలకొన్న ఆర్ధిక వివాదాలు, పౌరసరఫరా సంస్థ బకాయిలపై ప్రధానంగా చర్చించబోతున్నారు. అలాగే గత ఐదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న షెడ్యూల్ 9,10 ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల పంపకాలు, డిల్లీలోని ఏపీ భవన్ పంపకాలపై అధికారులు చర్చించబోతున్నారు. అయితే ఇవన్నీ జటిలమైన సమస్యలే కనుక ముందుగా పరిష్కారించగలవాటిపై చర్చించాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. విభజన సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇరు రాష్ట్రాల అధికారులు బహుశః మరికొన్నిసార్లు సమావేశం కావలసి ఉంటుంది. ముఖ్యమంత్రుల అభీష్టం మేరకు అధికారులు కూడా పట్టువిడుపులు ప్రదర్శించి సమస్యలను పరిష్కరించుకోగలుగుతారా లేదా అనేది త్వరలోనే తెలుస్తుంది. సమస్యల పరిష్కారంలో పురోగతిని బట్టి మళ్ళీ కేసీఆర్, జగన్ వచ్చే నెల అమరావతిలో సమావేశమయ్యి వాటిపై తుది నిర్ణయాలు తీసుకుంటారు.