
తెలంగాణ సచివాలయం, శాసనసభ, మండలి కొత్త భవనాలు కట్టాలని నిర్ణయించుకున్న తెలంగాణ ప్రభుత్వం, పాత సచివాలయాన్ని, ఎర్రమంజిల్‌లో భవనాలను కూల్చివేయాలని భావిస్తోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఓయూ విద్యార్ధి జె.శంకర్, సామాజిక కార్యకర్త డాక్టర్ లుబ్నా సార్వత్‌లు వేర్వేరుగా వేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో హైకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.
ప్రస్తుతం వినియోగంలో ఉన్న సచివాలయం చాలా విశాలంగా, సౌకర్యవంతంగా, మరొక 5-6 దశాబ్దాల పాటు నిలిచే అంత ధృడంగా ఉందని, అటువంటి భవనాలను వాస్తుపేరుతో కూల్చుకోవడం సరికాదని, అది ప్రజాధనం వృధా చేయడమేనాని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది వాదించారు. కనుక ఆ భవనాలను వేరే కార్యాలయాలకు కేటాయించి, వేరే ప్రాంతంలో కొత్త సచివాలయం నిర్మించుకుంటే మంచిదని వాదించారు. ఈ కేసుతో సహా జె.శంకర్, డాక్టర్ లుబ్నా సార్వత్‌లు వేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు, ఎర్రమంజిల్ భవనాల కూల్చివేయకుండా నిలిపివేసేందుకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి నిరాకరించింది. ఈ మూడు కేసులను జూలై 8కి వాయిదా వేసింది.