తెలంగాణ టిడిపి నేతలు బిజెపిలోకి జంప్

గత అసెంబ్లీ ఎన్నికల తరువాత తెలంగాణలో టిడిపి చాలా వరకు ఖాళీ అయిపోయింది. ఈసారి ఎన్నికలలో కూడా కాంగ్రెస్‌-టిడిపి కూటమి ఓడిపోవడంతో ఆ రెండు పార్టీల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. దాంతో ఆ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు వీలైతే తెరాసలోకి లేకుంటే బిజెపిలో చేరిపోతున్నారు. తాజాగా టిడిపి సీనియర్ నేతలు పెద్దిరెడ్డి, బోడ జనార్ధన్, చాద సురేశ్ రెడ్డి బిజెపిలో చేరిపోయారు. వారితోపాటు కాంగ్రెస్‌ నేతలు శశిధర్, షేక్ రహ్మతుల్లా తదితరులు గురువారం డిల్లీలో బిజెపి కార్యాలయంలో ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెపి నడ్డా సమక్షంలో కాషాయకండువాలు కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె. లక్ష్మణ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీరావు, తదితరులు పాల్గొన్నారు. 

అనంతరం కె. లక్ష్మణ్ డిల్లీలో తెలుగు మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణలో తెరాస-కాంగ్రెస్‌ మద్య మ్యాచ్ ఫిక్సింగ్ జరుగడంతో రాష్ట్రంలో ప్రతిపక్షమేలేకుండా చేసేందుకు సిఎం కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో కూడా పశ్చిమబెంగాల్ తరహాలో బిజెపి కార్యకర్తలపై భౌతికదాడులకు పాల్పడుతూ భయబ్రాంతులను చేయాలని తెరాస ప్రయత్నిస్తోంది. కనుక రాష్ట్రంలో కేసీఆర్‌ అప్రజాస్వామిక, నియంతృత్వపాలనను వ్యతిరేకిస్తున్నవారందరూ తెరాసకు ఏకైక ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న బిజెపిలో చేరుతున్నారు. 

సిఎం కేసీఆర్‌కు ఉన్న భవనాలను కూల్చుకోవడం, వందల కోట్లు ఖర్చు చేసి కొత్తవి కట్టుకోవడం పరిపాటిగా మారింది. కమీషన్లు, కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే ఆయన ఇటువంటి పనులు చేస్తున్నారని భావిస్తున్నాము. కేస్ అధికారంలోకి వచ్చినప్పటికి రాష్ట్రానికి రూ. 69,000 కోట్లు అప్పులు ఉండగా, గత ఐదేళ్ళలో ఆయన వాటిని రూ.1.80 లక్షల కోట్లకు చేర్చారు. కొత్త సచివాలయం, కొత్త శాసనసభ, మండలి భవనాల నిర్మాణాలను మా పార్టీ వ్యతిరేకిస్తుంది,” అని అన్నారు.