
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంపై సీఎల్పీ నేత
భట్టి విక్రమార్కకు తెరాస నేతలకు మద్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది. తెరాస ఎమ్మెల్యే
బాల్కా సుమన్ తనపై చేసిన విమర్శలకు ధీటుగా భట్టి విక్రమార్క స్పందించారు.
గురువారం డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ,
“కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిపోయిందన్నట్లు సిఎం కేసీఆర్ ప్రజలను తప్పు
ద్రోవ పట్టిస్తున్నారు. రూ.50,000 కోట్లు ఖర్చు చేసి కేవలం 15
శాతం పనులు చేసి, రేపు ప్రారంభోత్సవం అంటూ హడావుడి చేయడానికి
సిద్దం అవుతున్నారు. 15 శాతం పనులకే రూ.50,000 కోట్లు ఖర్చు చేస్తే, మొత్తం ప్రాజెక్టు పూర్తి కావడానికి ఇంకా ఎన్ని లక్షల కోట్లు కావాలి? కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబందించి డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డిపిఆర్)ను
శాసనసభలో ప్రవేశపెట్టమని ఎన్నిసార్లు అడిగినా కేసీఆర్ ప్రవేశపెట్టలేదు. ఆ ప్రాజెక్టులో
భారీగా అవినీతి జరిగింది. అందుకే డిపిర్ను సభలో ప్రవేశపెట్టడానికి కేసీఆర్ జంకుతున్నారు.
ఆ అవినీతికి సంబందించి బలమైన ఆధారాలు మా దగ్గరున్నాయి. త్వరలో వాటినన్నిటినీ బయటపెడతాము.
నిజానికి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో 70 శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టుల
నిర్మాణాలు పూర్తి కాకుండా ఆనాడు అడ్డుపడింది కేసీఆరే. ప్రాజెక్టులకు అడ్డుపడి తెలంగాణ
ప్రజలకు నీళ్ళు రాకుండా చేసిన కేసీఆరే నేడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి నీళ్ళు
అందిస్తున్నామని గొప్పలు చెప్పుకొంటున్నారు. తెలంగాణ ప్రాజెక్టుల కోసం ఏమి చేశారని
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి
కేసీఆర్ ఆహ్వానించారు?” అని భట్టివిక్రమార్క అన్నారు.