ఎమ్మెల్యే రాజాసింగ్ హడావుడి దేనికో?

రాష్ట్రంలో ఏకైక బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ బుదవారం రాత్రి హైదరాబాద్‌ జూమ్మెరాత్ బజారులో తన అనుచరులతో కలిసి చాలా హడావుడి చేశారు. సుమారు 10 ఏళ్ళ క్రితం బజార్ కూడలిలో ఆయన స్వాతంత్ర్య సమరయోధురాలు రాణి అవంతి భాయ్ 12 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. దాని స్థానంలో 24 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి రాజా సింగ్ ఆయన అనుచరులు సిద్దమవుతుండగా, వెస్ట్ జోన్ డీసీపి శ్రీనివాస్ నేతృత్వంలో పోలీసులు అక్కడకు చేరుకొని వారిని అడ్డుకున్నారు. పాత విగ్రహం కంటే రెట్టింపు ఎత్తున్న విగ్రహాన్ని పెట్టడానికి అనుమతి లేదని వారించారు. వారితో రాజా సింగ్ వాగ్వాదానికి దిగడంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. 

అప్పుడు ఆయన ఒక రాయితో తలపై బలంగా కొట్టుకొన్నారు. ఆ విషయం ఆయనే స్వయంగా మీడియాకు తెలిపారు. కానీ పోలీసులు లాఠీతో కొట్టడం వలన తలకు గాయం అయ్యిందని చెపుతున్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం తనను పోలీసులతో అంతమొందించడానికి కుట్ర పన్నుతోందని, ఆ విషయం గ్రహించి తనను చంపదలిస్తే ఈవిధంగా రాయితో తలపై కొట్టి చంపమని చెప్పేందుకే తలపై మెల్లగా కొట్టుకొని చూపించానని రాజా సింగ్ స్వయంగా చెప్పారు. 

ఎమ్మెల్యే అయిన తనపై కూడా పోలీసులు దౌర్జన్యం చేశారని, వారి బెదిరింపులకు, కేసులకు తాను భయపడబోనని రాజా సింగ్ అన్నారు. బెంగాల్ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంలాగా కేసీఆర్‌ ప్రభుత్వం బిజెపి కార్యకర్తలను వేధిస్తోందని కానీ ఇక్కడి బిజెపి కార్యకర్తలను ఎవరూ భయపెట్టలేరని అన్నారు. గత 10 సం.లుగా అవంతీ భాయ్ విగ్రహానికి మరమత్తులు చేయిస్తూ, ప్రతీ రెండుమూడేళ్ళకోసారి మారుస్తుంటానని, అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు దేనికని ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రశ్నించారు. ఆయనపై గోషామహల్ పోలీసులు కేసు నమోదు చేసారు. రాజా సింగ్ పై పోలీసుల దాడిని రాష్ట్ర బిజెపి కె.లక్ష్మణ్ ఖండించారు. 

బెంగాల్ రాష్ట్రం గురించి రాజా సింగ్ చెప్పిన మాటలనే వేరే కోణంలో నుంచి చూస్తే, ఆ రాష్ట్రంలో బిజెపి ఏవిధంగా తన ఉనికి చాటుకొని బలపడేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోందో తెలంగాణలో కూడా అదేవిదంగా చేస్తోందని ఈ ఘటన నిరూపిస్తోంది. కనుక రానున్న రోజులలో రాష్ట్రంలో బిజెపి హడావుడి మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కనుక తెరాస కూడా అప్రమత్తంగా ఉండక తప్పదు.