
ఈరోజు ఉదయం టీఆర్టీ అభ్యర్ధులు ముఖ్యమంత్రి అధికార నివాసం ప్రగతి భవన్‌ను ముట్టడికి ప్రయత్నించడం ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీఆర్టీ ఫలితాలు ప్రకటించి 7 నెలలు కావస్తున్నా ఇంతవరకు నియమకాలు చేపట్టకకుండా, విద్యావాలంటీర్లను మరొక ఏడాదిపాటు కొనసాగిస్తూ విద్యాశాఖ బుదవారం ఉత్తర్వులు జారీచేయడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస అధికారంలోకి రాగానే టీఆర్టీ అభ్యర్ధులకు నియామకపత్రాలు ఇస్తామని హామీ ఇచ్చిందని, కానీ 7 నెలల తరువాత ఇప్పుడు విద్యావాలంటీర్లను మరొక ఏడాది పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసి తమను మోసం చేసిందని టీఆర్టీ అభ్యర్ధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా పోస్టింగులు ఇవ్వకపోతే తామందరం కలిసి నిరవధిక నిరాహార దీక్షకు కూర్చోంతామని టీఆర్టీ అభ్యర్ధులు హెచ్చరించారు. పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేశారు.