హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సదస్సు

ఒక నగరం జాతీయ, అంతర్జాతీయ సదస్సులకు వేదికగా నిలుస్తోందంటే దానార్ధం ఆ నగరానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోందని...శరవేగంగా అభివృద్ధి చెందుతోందనే సంకేతంగా భావించవచ్చు. ప్రపంచ తెలుగు మహాసభలకు వేదికగా నిలిచిన హైదరాబాద్‌ నగరం ఇప్పుడు అంతర్జాతీయ విత్తన సదస్సు (ఇస్టా కాంగ్రెస్‌)కు వేదికగా నిలువబోతోంది. 

ఈ నెల 26 నుంచి జూన్ 3వరకు జరుగబోయే ఈ సదస్సులో ప్రపంచంలో 70 దేశాల నుంచి సుమారు 800 మందికి పైగా విట్టనోత్పత్తి సంస్థల ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. కొండాపూర్‌లోని ఇజ్జత్‌ నగర్ వద్ద గల నోవాటేల్ & హెచ్ఐసిసి కాంప్లెక్స్ లో ఈ సదస్సు జరుగబోతోంది. 

ఈ సదస్సుకు రెండు రోజుల ముందుగానే ఆఫ్రికాదేశాల విత్తనోత్పత్తి సంస్థల ప్రతినిధులతో దేశంలోని విత్తనోత్పత్తి సంస్థల ప్రతినిధులు సమావేశమవుతారు. రెండు రోజులపాటు సాగే ఈ విత్తనోత్పత్తి వర్క్ షాపులో భారత్‌, ఆఫ్రికా దేశాలలో వివిద రకాల భూములు, వాతావరణాలలో సాగుకు అనుకూలమైన విత్తనాల ఉత్పత్తి గురించి లోతుగా చర్చిస్తారని సమాచారం. ఈ సదస్సులో ముఖ్యంగా చిన్న, మధ్యతరహా విత్తనోత్పత్తి సంస్థలకు అవసరమైన ఆధునిక సమాచారం లభిస్తుంది కనుక వాటికి ఎంతో మేలు కలిగే అవకాశం ఉంది.  

ఈ అంతర్జాతీయ సదస్సు ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్కే జోషి పోలీస్ శాఖతో సహా వివిదశాఖల ఉన్నతాధికారులతో సమీక్షాసమావేశం జరిపి అవసరమైన సూచనలు చేశారు. ముఖ్యంగా ఈ సదస్సుకు హాజరయ్యే విదేశీ ప్రతినిధులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.