.jpg)
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మేడిగడ్డ బ్యారేజి నిర్మాణానికి అవసరమైన అటవీభూమిని వినియోగించుకునేందుకు కేంద్ర అటవీ, పర్యావరణశాఖ అనుమతించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మహారాష్ట్రవైపు బండ్, కరకట్టలను నిర్మించవలసి ఉంది. కానీ ఆ ప్రాంతంలో అటవీశాఖ భూములున్నాయి. కనుక వాటిలో 10 హెక్టార్ల భూమిని ఈ ప్రాజెక్టు కోసం వినియోగించుకొనేందుకు అనుమతించాలని, దానికి బదులుగా వేరే చోట సమానమైన భూమిని కేటాయించి అడవులను పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ వ్రాసింది. అందుకు అవసరమైన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడంతో కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ 10 హెక్టార్ల అటవీశాఖ భూమిని మేడిగడ్డ బ్యారేజి పనుల కోసం బదలాయించుకోవడానికి అనుమతి మంజూరు చేసింది. దీంతో మేడిగడ్డ బ్యారేజి పనులకు గల అన్ని అవరోధాలు తొలగిపోయినట్లే.