
ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి తన మంత్రివర్గంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యతనిచ్చినందుకే ప్రశంశలు వెలువెత్తుతుండగా, ఈరోజు ఆయన అధ్యక్షతన అమరావతిలో జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలో సంచలన నిర్ణయాలను చూసి ఆయా వర్గాల ప్రజలు, ఉద్యోగులు జగన్‌కు అప్పుడే జేజేలు పలుకుతున్నారు.
మంత్రివర్గ నిర్ణయాలు:
1. ఆర్టీసీని రాష్ట్రప్రభుత్వంలో విలీనం చేయడానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. దీనికి సంబందించి విధివిధానాలను రూపొందించేందుకు ఒక హైలెవెల్ కమిటీని ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేస్తుంది. అది నిర్ధిష్ట గడువులోగా నివేదిక సమర్పించవలసి ఉంటుంది. ఆ నివేదిక ఆధారంగా విలీన ప్రక్రియ మొదలవుతుంది. ఆర్టీసీలో శిధిలావస్థకు చేరుకొన్న బస్సులన్నిటినీ తొలగించి వాటి వాటిస్థానంలో కొత్త బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయం. అలాగే దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయం.
2. ఆరోగ్యశ్రీ పరిధిలోకి మరింతమంది ప్రజలను తీసుకువచ్చి, దాని కింద అందించే వైద్య చికిత్సల సంఖ్యను కూడా పెంచాలని నిర్ణయం.
3. గతంలో నెలకు రూ.3,000 జీతం అందుకొంటున్న మెప్మా, సెర్ప్‌లో డ్వాక్రా మహిళా సంఘాలు, ఆశా వర్కర్లకు ఇక నుంచి నెలకు రూ.10,000 జీతం చెల్లింపు.
4. అంగన్వాడీ వర్కర్లకు ఇక నుంచి నెలకు రూ.11,500 జీతం చెల్లింపుకు ఆమోదముద్ర.
5. మారుమూల గిరిజన ప్రాంతాలలో పనిచేస్తున్న హెల్త్ వర్కర్లకు ప్రస్తుతం నెలకు రూ.400 జీతం పొందుతున్నారు. దానిని రూ.4,000కు పెంచాలని మంత్రివర్గం నిర్ణయించింది.
6. వివిద ప్రభుత్వ కార్యాలయాలలో, ముఖ్యంగా మున్సిపాలిటీ మరియు ప్రభుత్వాసుపత్రులలో పనిచేసే కాంట్రాక్ట్ శానిటరీ వర్కర్లకు నెలకు రూ.18,000 జీతం చెల్లింపుకు ఆమోదముద్ర.
7. మధ్యాహ్నం భోజన పధకంలో వంటలు చేస్తున్నవారికి నెలకు రూ.3,000 గౌరవ వేతనం చెల్లింపు.
8. 40కిమీ పరిధిలో గల ప్రభుత్వ పాఠశాలలన్నిటికీ కలిపి కేంద్రీకృత వంటశాలను ఏర్పాటు చేసి అక్కడి నుంచే అన్ని పాఠశాలలకు ఆహారం సరఫరా చేయాలనే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
9. వివిద ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను అనుభవం, అర్హత ఆధారంగా రెగ్యులరైజ్ చేయాలని సూత్రప్రాయంగా ఆమోదం. దీనికోసం ఏర్పాటు చేయబోయే సబ్ కమిటీ విధివిధానాలు రూపొందించి నివేదిక ఇవ్వగానే దాని ఆధారంగా రెగ్యులరైజింగ్ ప్రక్రియ మొదలవుతుంది.
10. ఆగస్ట్ 15 నుంచి ప్రతీ గ్రామంలో ఒక గ్రామ సేవకుడి నియామకం. పట్టణాలలో అయితే డిగ్రీ, గ్రామాలలో ఇంటర్, మారుమూల గ్రామాలలో 10వ తరగతి కనీస విద్యార్హత కలిగి ఉండాలి. వారికి నెలకు గౌరవ వేతనం రూ.5,000.
11. గ్రామాలలో ప్రజలు రేషన్ డిపోల వద్ద నిలబడనవసరం లేకుండా గ్రామసేవకుల ద్వారా గుమ్మం వద్దకే రేషన్ సరుకులు సరఫరా.
12. రేషన్ సరుకులలో నాణ్యమైన బియ్యంతో పాటు మరొక నాలుగైదు నిత్యావసరకుల సరఫరా.
13. గ్రామాలలో ఇళ్ళులేని పేదలకు ప్రభుత్వమే స్థలం కొని ఇళ్ళు కట్టించి ఇస్తుంది. ముందుగా వచ్చే ఏడాది ఉగాది నుంచి గృహిణి పేరుమీద ఇళ్ళ స్థలాలు రిజిస్ట్రేషన్ చేసి 2021 నుంచి ఆ స్థలాలో ఇళ్ళ నిర్మాణ పనులు ప్రారంభించబడతాయి.
14. గత ఐదేళ్ళుగా రైతులకు బకాయి పడ్డ రూ. 2,000 కోట్ల ఇన్పుట్ సబ్సీడీని తక్షణమే చెల్లింపుకు ఆమోదముద్ర.
15. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ స్థిరీకరణ కోసం రూ.3,000 కోట్లు స్థిరీకరణ మూలనిధి కేటాయించాలని నిర్ణయం.
16. అక్టోబర్ 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతుభరోసా పధకం మొదలవుతుంది. దీని క్రింద ఏడాదికి రూ.12,500 ప్రభుత్వం చెల్లిస్తుంది. (దీనికి సంబందించి విడివిధానాలు ఇంకా తెలియవలసి ఉంది.)
17. బ్యాంకుల దగ్గర నుంచి రైతులు తీసుకునే రుణాలపై వడ్డీని ప్రభుత్వం భరిస్తుంది. రైతులు అసలు చెల్లిస్తే సరిపోతుంది.
18. వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు నిరంతరంగా ఉచిత విద్యుత్ సరఫరా.
19. పంటభీమా పధకానికి ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి, నష్టం వాటిల్లితే ప్రభుత్వమే క్లెయిములు పరిష్కరించి రైతులకు ఆ సొమ్మును అందజేస్తుంది.
20. పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒక్కో బోరింగ్ యంత్రాలను ఏర్పాటు చేసి ప్రాధాన్యతా క్రమంలో ఉచితంగా బోర్లు వేయించాలని నిర్ణయం.
21. వచ్చే ఏడాది జనవరి 26 నుంచి రాష్ట్రంలో అమ్మ ఒడి సంక్షేమ పధకం అమలు. పిల్లలను బడులకు పంపే తల్లుల బ్యాంక్ ఖాతాలలో ఏడాదికి రూ.15,000 ప్రభుత్వం జమా చేస్తుంది.
22. సామాజిక పింఛనులు రూ.1,000 నుంచి రూ.2,250కి పెంపు.
23. ప్రభుత్వోద్యోగులకు ఐఆర్ 27 శాతం పెంపు.
24. సిపిఎస్ రద్దుకు సూత్రప్రాయంగా ఆమోదం.
25. టెండర్ల దశలోనే అవినీతిని అరికట్టేందుకు హైకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన జ్యూడీషియల్ కమిటీ ఏర్పాటు.
అవినీతి ఏ స్థాయిలో జరిగినా ప్రజలు ఏడా బాధితులు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్ చేసి ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించాలని నిర్ణయం. ప్రజల జీవితాలపై మంచి ప్రభావం చూపగల ఇంకా అనేక నిర్ణయాలను జగన్ మంత్రివర్గం తీసుకొంది.