
పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెరాసలో విలీనం చేసుకోవడాన్ని నిరసిస్తూ సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు ఇందిరా పార్కులో నిరసనదీక్షలు చేసినప్పుడు వారందరూ సిఎం కేసీఆర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఒక దళితుడు ప్రధానప్రతిపక్ష నేతగా ఉండటం సహించలేక, అతను తన శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీయడం భరించలేకనే కుట్రపన్ని సీఎల్పీని తెరాసలో విలీనం చేశారు. సిఎం కేసీఆర్ శాసనసభను మయసభలాగ మార్చుకొని సభలో తనకే ఎదురేలేదని దుర్యోధనుడిలా వికటాట్టహాసం చేయాలనుకొంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా పోయిందని సిఎం కేసీఆర్, కేటీఆర్ పైశాచికానందం అనుభవిస్తున్నారు. నిజామాబాద్‌లో తనకు ఎదురెలేదనుకొన్న కేసీఆర్ కుమార్తె లోక్‌సభ ఎన్నికలలో కవిత ఓడిపోయారు. కనుక పదవులు, అధికారం శాస్వితంకావని వారు గ్రహిస్తే మంచిది. ప్రశ్నించే గొంతులు ఉండకూడదని కేసీఆర్ భావిస్తున్నారు. కానీ ప్రశ్నించే గొంతులే లేకపోతే ప్రజాస్వామ్యం స్థానంలో నిరంకుశత్వం వస్తుంది. బెదిరించేవాడిదే రాజ్యం అవుతుందని ప్రజలు కూడా గుర్తించాలి,” అని అన్నారు.
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, “ఎన్నికలలో ప్రజలు తమకు నచ్చిన పార్టీ అభ్యర్ధులకు ఓట్లేసి ఎన్నుకొన్నాక వారిని తెరాసలో చేర్చుకొనేమాటయితే ఇక ఎన్నికలెందుకు? ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారే ఉండకూడదని భావిస్తున్నప్పుడు ఇక అసెంబ్లీ ఎందుకు? తెరాసకు సరిపడినంత మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ప్రతిపక్షాల ఎమ్మెల్యేలను కూడా ఫిరాయింపజేసుకొని సిఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ప్రజల ఆకాంక్షల నెరవేరడం కోసం తెలంగాణ ఏర్పడితే, కేసీఆర్ అప్రజాస్వామికంగా, నిరంకుశ పాలన చేస్తున్నారు. ఆయన వైఖరిని ప్రజలు నిశితంగా గమనిస్తూనే ఉన్నారని మరిచిపోకూడదు,” అని అన్నారు.