
కాంగ్రెస్ ఎల్పీ నేత భట్టి విక్రమార్క దీక్షను పోలీసులు సోమవారం ఉదయం భగ్నం చేసి నీమ్స్ ఆస్పత్రికి తరలించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెరాసలో విలీనం చేసుకోవడాన్ని నిరసిస్తూ ఆయన గత మూడు రోజులుగా హైదరాబాద్ ఇందిరాపార్కులో నిరాహారదీక్ష చేస్తున్నారు. ఆ కారణంగా ఆయన షుగర్, బీపీ లెవెల్స్ పడిపోయి చాలా నీరసించిపోయారు. వైద్యుల సలహా మేరకు పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేసి నీమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా పోలీసులను అడ్డుకొనేందుకు అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించడంతో కాసేపు ఘర్షణవాతావరణం ఏర్పడింది. తన దీక్షను పోలీసులు భగ్నం చేయడంపై మల్లు భట్టివిక్రమార్క ఆగ్ర్హమ్ వ్యక్తం చేస్తూ, “అప్రజాస్వామిక, నియంతృత్వ వైఖరి కలిగిన కేసీఆర్ వంటి ముఖ్యమంత్రులు దేశంలో మరో నలుగురు ఉన్నట్లయితే, ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదం ఏర్పడుతుంది. ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ పోరాటాలు కొనసాగిస్తుంది,” అని అన్నారు.