అక్బరుద్దీన్‌ ఓవైసీకి ఏమైంది?

మజ్లీస్ శాసనసభాపక్ష నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఆయన సోదరుడు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఖండించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, దానిపై సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలను ఎవరూ నమ్మవద్దని పార్టీ కార్యకర్తలను కోరారు. 

2011లో అక్బరుద్దీన్ ఓవైసీపై బార్కస్‌లో కాల్పులు జరిగినప్పటి నుంచి అప్పుడప్పుడు ఆయనకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఆయన పార్టీ అభ్యర్ధుల గెలుపుకోసం తీవ్రంగా శ్రమించడంతో మళ్ళీ ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. దాంతో ఆయన గత నెల 5వ తేదీన చికిత్స కోసం కుటుంబ సమేతంగా లండన్ వెళ్ళారు. నేటికీ అక్కడే ఉంటూ చికిత్స పొందుతున్నారు. కానీ ఇటీవల ఆయనకు వైద్యులు అత్యవసర చికిత్సలు చేయడంతో ఆయన ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉందని సోషల్ మీడియాలో ఊహాగానాలు వచ్చాయి. తన సోదరుదూ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న మాట వాస్తవమేకానీ ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. త్వరలోనే కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో హైదరాబాద్‌ తిరిగివస్తారని చెప్పారు. ఆయన ఆరోగ్యం కోసం అందరూ అల్లాను ప్రార్ధించాలని కోరారు.