
పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెరాసలో విలీనం చేసుకోవడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఖండించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్ ప్రజాస్వామ్య విలువలను ఏమాత్రం పట్టించుకోకుండా వరుసగా తప్పులు చేస్తున్నారు. ఫిరాయింపులపై హైకోర్టులో కేసు విచారణలో ఉండగానే కాంగ్రెస్ శాసనసభ్యులను తెరాసలో విలీనం చేసుకోవడం చూస్తే రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువల పట్ల ఆయనకు ఏమాత్రం గౌరవం లేదని స్పష్టం అవుతోంది. కాంగ్రెస్ పార్టీపై కక్ష సాధించడానికే ఆయన ఇటువంటి అప్రజాస్వామిక, అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని మేము భావిస్తున్నాము. ప్రలోభాలకు లొంగి తెరాసలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే చేరామని చెప్పుకోవడం సిగ్గుచేటు. ప్రజాస్వామ్య పద్దతులలో కేసీఆర్ సర్కారుపై పోరాటాలకు మేము సిద్దంగా ఉన్నాము. సిఎం కేసీఆర్ తన వైఖరిని మార్చుకోకపోతే ఉద్యమాలు తప్పవు,” అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీని తమ రాజకీయ ప్రత్యర్ధిగా భావించే బీజేపీ కూడా ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించడం విశేషం. ఆ పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి మురళీరావు మీడియాతో మాట్లాడుతూ, “శాసనసభలో తెరాస ఒక్కటే ఉండాలని సిఎం కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఫిరాయింపజేసుకొంటున్నారు. కేసీఆర్ ఇదేవిధంగా రాజకీయాలు చేస్తుంటే ఏదో ఒకరోజు ప్రజలు తిరగబడే రోజు తప్పక వస్తుందని గుర్తుంచుకోవాలి. రాష్ట్రంలో రాజకీయ మార్పుకు బిజెపి నాంది పలుకబోతోంది,” అని అన్నారు.