గోల్కొండ కోటపై కాషాయజెండా ఎగురవేయాలి: కిషన్‌రెడ్డి

కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా శుక్రవారం హైదరాబాద్‌ వచ్చిన జి.కిషన్‌రెడ్డిని బిజెపి నేతలు, కార్యకర్తలు బేగంపేట ఎయిర్‌పోర్టులో ఘనా స్వాగతం పలికి, ఊరేగింపుగా నాంపల్లి కార్యాలయానికి తీసుకువెళ్ళి ఘనంగా సన్మానించారు. 

ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఒక్క బిజెపిలో మాత్రమే నావంటి సామాన్య కార్యకర్త కూడా ఇంత ఉన్నతస్థాయికి ఎదిగే అవకాశం ఉంది. కనుక ఈ గౌరవం నాకు కాదు... ఒక సామాన్య కార్యకర్తకు దక్కిన గౌరవంగానే భావిస్తున్నాను. మన తెలుగువారిలో వెంకయ్యనాయుడు, విద్యాసాగర్ రావులు కూడా ఇదేవిధంగా ఉన్నతస్థాయికి ఎదిగారు. పార్టీలో బండారు దత్తాత్రేయ, వి.రామారావు వంటి పెద్దలు నా ఎదుగుదలకు సహకరించి ఎంతో ప్రోత్సహించారు. అందుకు వారికి సర్వదా ఋణపడి ఉంటాను. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి గతంలో అనేకమంది నేతలు తీవ్రంగా కృషి చేశారు. నేటికీ కృషి చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో తెరాస కార్యకర్తల చేతిలో హత్యకు గురైన బిజెపి కార్యకర్త ప్రేమ్ కుమార్‌కు నివాళులు ఆర్పిస్తున్నాను. ఆయన హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి గోల్కొండకోటపై కాషాయజెండా ఎగురవేయడమే లక్ష్యంగా మనమందరం కలిసికట్టుగా పనిచేయాలి,” అని అన్నారు.