
తెరాసను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై మండలి ఛైర్మన్ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు అనర్హత వేటుపడ్డ ఎమ్మెల్సీలు కె.యాదవరెడ్డి, రాములు నాయక్ కూడా ఛైర్మన్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. వారి పిటిషన్లపై గురువారం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
రాష్ట్ర ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ జె. రామచంద్రరావు కోర్టులో వాదిస్తూ, భూపతిరెడ్డి రాజకీయ దురుదేశ్యంతోనే తెరాసపై విమర్శలు చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారని, ఆయన డిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను కలిసినట్లు మీడియాలో వార్తలు కూడా వచ్చాయని, ఆయన పార్టీ మారినట్లు దృవీకరించుకొన్న తరువాతే మండలి ఛైర్మన్ భూపతిరెడ్డిపై అనర్హత వేటు వేశారని అన్నారు. ఈరోజు భూపతిరెడ్డి తరపు న్యాయవాది హైకోర్టులో తన వాదనలు వినిపిస్తారు.
12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెరాసలో విలీనం చేసుకున్నప్పుడే భూపతిరెడ్డి అనర్హత కేసు హైకోర్టులో విచారణకు రావడం యాదృచ్చికమే కానీ ఈ పరిణామం కాంగ్రెస్, తెరాసలు రెంటికీ కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది.
తెరాస ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నప్పుడు లేని అభ్యంతరం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెరాసలో చేర్చుకుంటే తప్పేమిటి? అని తెరాస ప్రశ్నించవచ్చు.
కాంగ్రెస్‌లో చేరినందుకు వెంటనే ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయించిన కేసీఆర్ సర్కార్, 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కూడా అనర్హత వేటు ఎందుకు వేయడం లేదని కాంగ్రెస్ ప్రశ్నించవచ్చు.