కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు తమను తెరాసలో విలీనం చేయాలని కోరుతూ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి గురువారం మధ్యాహ్నం లేఖ ఇవ్వడం వెనువెంటనే దానిని ఆయన ఆమోదించడం, ఆ వెంటనే శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు విలీన ప్రక్రియ పూర్తయినట్లు ప్రకటించడం చకచకా జరిగిపోయాయి. దీంతో శాసనసభలో తెరాస బలం 102కు చేరుకోగా కాంగ్రెస్ బలం 6కు పడిపోయింది. స్పీకరుకు లేఖ ఇచ్చినవారిలో ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, హరీప్రియ నాయక్, గండ్ర వెంకటరమణా రెడ్డి, వనమా వెంకటేశ్వరులు, చిరుమర్తి లింగయ్య, కందాల ఉపేందర్ రెడ్డి, రేగ కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, సుధీర్ రెడ్డి, ఆత్రం సక్కు, జాజుల సురేందర్, పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెరాసలో విలీనం చేసుకోబోతున్నట్లు తెలియగానే పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఫోన్ చేసి అభ్యంతరం వ్యక్తం చేయాలనుకొన్నారు. కానీ అటువైపు నుంచి స్పీకర్ అందుబాటులో లేరని సమాధానం వచ్చింది. కానీ అదే సమయంలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకరును కలిసి లేఖ ఇచ్చారు. స్పీకరు వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ ముందు నిరసనలు తెలియజేసినప్పటికీ ఆయన వారిని ఏమాత్రం పట్టించుకోకుండా విలీనానికి ఆమోదముద్ర వేశారు. స్పీకర్ పరిధిలో ఉండే ఈ వ్యవహారంలో న్యాయస్థానాలు కూడా జోక్యం చేసుకోవని గతంలోనే స్పష్టమైంది కనుక కాంగ్రెస్ నేతలు ప్రజలలోకి వెళ్ళి మొరపెట్టుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు.