ఊహించినట్లుగానే తెరాసలో చేరిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ నుంచి నేరుగా అసెంబ్లీ చేరుకొని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి తమను తెరాసలో విలీనం చేయవలసిందిగా కోరుతూ ఈరోజు మధ్యాహ్నం లేఖ ఇచ్చారు. దీనిపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, సీనియర్ నేతలు షబ్బీర్ ఆలీ, జగ్గారెడ్డి, అంజన్ కుమార్, శ్రీధర్ బాబు, తదితరులు అసెంబ్లీ వద్దకు చేరుకొని నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని గాంధీ విగ్రహం ముందు రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు.
తాము ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వినతిపత్రం ఇవ్వడానికి వెళితే మొహం చాటేసిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఇంతవరకు వారిపై చర్యలు తీసుకోకపోగా, ఆ ఎమ్మెల్యేలు తమను తెరాసలో విలీనం చేయమని లేఖ ఇచ్చేందుకు వస్తే వారిని రహస్యంగా కలుసుకొన్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగాన్ని కాపాడవలసిన స్పీకర్ తెరాస ప్రతినిధిలాగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తీరును నిరసిస్తూ తాము రోడ్డుపై బైటాయించి నిరసన దీక్ష చేస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
స్పీకరును కలిసిన వారిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, ఆత్రం సక్కు, హరిప్రియా, జాజుల సురేందర్, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, సుధీర్ రెడ్డి, వనమా వెంకటేశ్వరరావు, రేగ కాంతారావు, పైలట్ రోహిత్ రెడ్డి, కందాల ఉపేందర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య ఉన్నారు. తామందరం సిఎం కెసిఆర్ నాయకత్వంలో పనిచేయాలనుకొంటున్నామని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు.