రోడ్డురోలరు గుర్తువల్లే ఓటమి: తెరాస

లోక్‌సభ ఫలితాల షాక్ నుంచి మెల్లమెల్లగా కోలుకొని తెరాస నేతలు మీడియా ముందుకు వస్తున్నారు. తెరాస ఎమ్మెల్యే ఫైళ్ళ శేఖర్ రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, “రోడ్డురోలరు గుర్తు వల్లే మా సిట్టింగ్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ స్వల్ప తేడాతో ఓడిపోవడం మాకు చాలా బాధ కలిగిస్తోంది. ఆయన గెలుపుకోసం మేమందరం చాలా కష్టపడ్డాము. అయినా ఓటమి ఎదురైంది. అయితే భువనగిరి నియోజకవర్గం ఎప్పటికైనా తెరాసదే. దానిపై గులాబీజెండాయే ఎగురుతుంది. నేను ఒక హోటల్‌కు వెళ్లినప్పుడు అదే సమయంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అక్కడికి రావడం యాదృచ్చికమే. మేమిద్దరం కనీసం మర్యాదపూర్వకంగా పలకరించుకోకపోయినా మా మద్య ఏదో జరుగుతోందని అప్పుడే సోషల్ మీడియాలో పుకార్లు మొదలైపోయాయి. కొందరు పనిగట్టుకొని నాపై ఎందుకు ఈవిధంగా దుష్ప్రచారం చేస్తున్నారో నాకు అర్దం కావడం లేదు,” అని అన్నారు. 

గెలిచినప్పుడు ప్రజలందరూ మావైపే ఉన్నారంటూ గొప్పలు చెప్పుకోవడం ఓడిపోయినప్పుడు ఇటువంటి కుంటిసాకులు చెప్పడం చాలా హాస్యస్పదంగా ఉంటుంది. ఒక అభ్యర్ధి నియోజకవర్గం అభివృద్ధి కోసం చేసిన మంచిపనులు లేదా స్థానిక ప్రజలతో గల సంబందబాంధవ్యాల ఆధారంగానే ఓట్లు పడతాయని శేఖర్ రెడ్డితో సహా అందరికీ తెలుసు. ఈవీఎంలలో రోడ్డురోలరు, కారు గుర్తులను గుర్తించలేనంత అవివేకులు కారు ఓటర్లు. ఒకరికి బదులు వేరొకరికి పొరపాటున ఓట్లు వేశారని చెప్పడం ఓటర్ల వివేకాన్ని, వారి తీర్పును అవమానించడమే.

అదేవిదంగా తమ గెలుపును గొప్పగా అభివర్ణించుకొనే నేతలు ప్రత్యర్ది గెలుపును తక్కువగా చేసి చూపాలనుకోవడం ప్రజాతీర్పును అవహేళన చేయడమే. కాంగ్రెస్ పార్టీని తెరాస రాజకీయంగా దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ కూడా తెరాసను దెబ్బకు దెబ్బ తీయాలని ప్రయత్నించకుండా ఉంటుందా? కానీ ఉండాలనుకోవడం అత్యాశే కదా? ఇటువంటి కుంటిసాకులతో సమర్ధించుకొనే బదులు నిజాయితీగా ఆత్మవిమర్శ చేసుకొని లోపాలు సరిదిద్దుకొంటే ఏమైనా ప్రయోజనం ఉంటుంది.