
లోక్‌సభ ఎన్నికలలో తెరాస 16 సీట్లు గెలుచుకొంటుందని కేసీఆర్, కేటీఆర్ తదితరులు భావిస్తే 9 సీట్లే గెలుచుకోవడం వారికి పెద్ద షాక్ అనే చెప్పాలి. ముఖ్యంగా కేసీఆర్ కుమార్తె కవిత, సిట్టింగ్ ఎంపీ వినోద్ కుమార్ ఓడిపోవడం మరీ పెద్ద షాక్. అసెంబ్లీ ఎన్నికలతో రాష్ట్రంలో బిజెపి పనైపోయిందనుకొంటే లోక్‌సభ ఎన్నికలలో ఏకంగా నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకోవడం ఇంకా పెద్ద షాక్. ఫిరాయింపులతో డీలాపడిన కాంగ్రెస్ పార్టీ కూడా 3 సీట్లు గెలుచుకొని, మరో రెండు సీట్లను తృటిలో చేజార్చుకొంది. ఒకవేళ వాటిని కూడా ఆదివారం గెలుచుకొని ఉండి ఉంటే అప్పుడు తెరాస 7 సీట్లకే పరిమితం అయ్యుండేది. లోక్‌సభ ఎన్నికలలో మళ్ళీ పుంజుకోవడంతో రాష్ట్రంలో తెరాస పతనం ప్రారంభం అయ్యిందంటూ కాంగ్రెస్, బిజెపిలు అప్పుడే ప్రచారం మొదలుపెట్టేసాయి. ఎన్నికల షాక్ నుంచి తేరుకొన్న తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫలితాల గురించి మంగళవారం మీడియాతో మాట్లాడారు.
“లోక్‌సభ ఫలితాలు ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో రకంగా రావడం మాకూ చాలా ఆశ్చర్యం కలిగించాయి. రాష్ట్రంలో నాలుగు సీట్లు గెలుచుకొంటామని బిజెపి నేతలు కూడా ఊహించి ఉండరు. ముఖ్యంగా అదిలాబాద్‌లో గెలుస్తామని ఊహించి ఉండరు. మోడీ హవా కారణంగానే బిజెపి గెలిచి ఉండవచ్చు.
ఇక మల్కాజ్‌గిరి, భువనగిరిలలో కాంగ్రెస్ వెంట్రుకవాసి తేడాతో విజయం సాధించింది లేకుంటే ఆ రెండు సీట్లు మాకే దక్కి ఉండేవి. నిజామాబాద్‌లో కవితను ఓడించేందుకు కాంగ్రెస్, బిజెపిలు కుమక్కయి పనిచేసినందునే ఓడారు. ఆమెను రైతులు వ్యతిరేకించారని మేము భావించడంలేదు. అయినా ఈసారి రాహుల్ గాంధీ, దేవగౌడ వంటివారే ఓడిపోయారు. కవిత ఒక పోరాటయోదుడి బిడ్డ. కనుక ఈ ఓటమిని చూసి ఆమె, మేము క్రుంగిపోము.
మజ్లీస్ పార్టీతో కలిసి మేము 10 సీట్లు గెలుచుకొంటే, మా పార్టీకి ఎదురుదెబ్బ తగిలిందని కాంగ్రెస్, బిజెపిలు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. మా గెలుపును తక్కువ చేసి చూపడానికే వారు ఆవిధంగా మాట్లాడుతున్నారు. కేంద్రంలో హంగ్ ఏర్పడుతుందని మేము భావించాము కానీ మళ్ళీ బిజెపి పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము కేంద్రంతో సత్సంబందాలు కొనసాగిస్తాము. రాష్ట్రానికి రావలసిన నిధుల కోసం కేంద్రంపై నిరంతరంగా ఒత్తిడి చేస్తూనే ఉంటాము,” అని అన్నారు.