ఏపీ ఇంటలిజన్స్ చీఫ్‌గా తెలంగాణ పోలీస్ అధికారి

ఈనెల 30న ఏపీ సిఎంగా బాధ్యతలు చేపట్టబోతున్న జగన్‌మోహన్‌రెడ్డి ముందుగా తన ప్రభుత్వం సమర్దులైన, విశ్వాసపాత్రులైన అధికారులను నియమించుకొంటున్నారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా నియమింపబడిన ఎల్వీ సుబ్రహ్మణ్యంను అదే పదవిలో కొనసాగిస్తూనే, రాష్ట్ర డిజిపిగా వ్యవహరిస్తున్న ఆర్‌.పి.ఠాకూర్‌ను తప్పించి ఆయన స్థానంలో గౌతమ్‌ సవాంగ్‌ను నియమించుకొంటున్నారు. అలాగే గతంలో తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌‌గా పని చేసిన తెలంగాణ క్యాడర్‌కు చెందిన స్టీఫెన్ రవీంద్రను ఏపీ ఇంటలిజన్స్ చీఫ్‌గా నియమించుకోబోతున్నారు. ప్రస్తుతం స్టీఫెన్ రవీంద్ర హైదరాబాద్‌ రేంజ్ ఐజీగా తెలంగాణ ప్రభుత్వానికి సేవలందిస్తున్నారు. 

ఈ ప్రతిపాదనకు సిఎం కేసీఆర్‌ అంగీకరించినందున స్టీఫెన్ రవీంద్రను ఏపీకి బదిలీ చేయవలసిందిగా కోరుతూ ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఒక లేఖ వ్రాస్తుంది. ఆయన బదిలీకి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ వ్రాస్తుంది. అది అందిన తరువాత స్టీఫెన్ రవీంద్రను ఏపీకి బదిలీ చేస్తూ కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడానికి సుమారు రెండువారాల సమయం పడుతుందని తెలుస్తోంది. ఈ సమాచారం అందుకొన్న స్టీఫెన్ రవీంద్ర కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్‌ నుంచి విజయవాడకు చేరుకొన్నారు. మరికొద్ది సేపటిలో తాడేపల్లిలో జగన్ క్యాంప్ కార్యాలయం చేరుకొని ఆయనతో భేటీ కాబోతున్నారు. 

గతంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి ప్రతిపాదనలు కలలో కూడా ఊహించలేని పరిస్థితి. కానీ ఇప్పుడు కేసీఆర్‌-జగన్ మద్య మంచి సఖ్యత ఉంది కనుక అన్ని పనులు చకచకా జరిగిపోతున్నాయి. మున్ముందు కూడా వారిరువురూ ఇలాగే పరస్పరం సహకరించుకొంటూ రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేస్తే రెండు రాష్ట్రాలలో తెలుగు ప్రజలు చాలా సంతోషిస్తారు.