వాళ్ళు ముగ్గురూ గట్టెక్కేశారు కానీ కాంగ్రెస్?

తెలంగాణలో నాలుగు లోక్‌సభ స్థానాలు గెలుచుకొన్నందుకు పండగ చేసుకోవాలో లేక జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఓడిపోయినందుకు సంతాపం పాటించాలో తెలియని పరిస్థితి ఏర్పడింది తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ ఓటమిని ముందే ఊహించినప్పటికీ, బిజెపికి కూడా మెజార్టీ రాదని అప్పుడు ప్రాంతీయ పార్టీల మద్దతుతో కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చునని కాంగ్రెస్‌ నేతలు కలలు కన్నారు. కానీ బిజెపి భారీ మెజార్టీతో విజయం సాధించగా కాంగ్రెస్ పార్టీ కనీసం 100 సీట్లు గెలుచుకోలేక చతికిలపడింది. 

అయితే లోక్‌సభ ఎన్నికలలో గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ముగ్గురూ ఒడ్డున పడ్డారనే చెప్పవచ్చు. వారు ముగ్గురూ ఒక్కో రకమైన తలనొప్పులను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలలో గెలవడంతో వాటి నుంచి తప్పించుకొని బయటపడబోతున్నారు. కానీ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితే ఆగమ్యగోచరంగా ఉంది. ఇప్పుడు దానిని ఎవరు కాపాడుతారో...అసలు ఎవరైనా కాపాడగలరో లేదో చూడాలి.