
యాకూత్ పురాకు చెందిన ఒక తెరాస నేతతో సహా మరో ఇద్దరు వ్యక్తులను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. వారు సిఎం కేసీఆర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి శేరిలింగంపల్లి మండలంలోని గచ్చిబౌలిలో సర్వే నెంబర్: 44/పి లోభాగంగా ఉన్న రెండు ఎకరాల భూమిని రెగ్యులరైజ్ చేయించుకొందామని ప్రయత్నించి పట్టుబడ్డారు.
వారు సిఎం కేసీఆర్ సంతకంతో ఉన్న లెటర్ హెడ్‌పై రెండు ఎకరాల భూమిని రెగ్యులరైజ్ చేయాలని ఆదేశిస్తూ లేఖను తయారు చేసి రెవెన్యూ డిపార్టుమెంటుకు పంపించారు. సాధారణంగా అధికారిక పత్రాలు, లేఖలు బట్వాడా చేయడానికి ప్రతీ శాఖలోను ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. వాటికి ఒక ప్రత్యేకంగా ఒక రికార్డుకూడా నిర్వహిస్తుంటారు. కానీ ఈ లేఖ వేరే విధంగా ఆర్డీఓ చేతికి అందడంతో ఆయనకు అనుమానం కలిగి పై అధికారుల ద్వారా సిఎంఓను సంప్రదించగా సిఎం కేసీఆర్ అటువంటి లేఖ ఎవరికీ ఇవ్వలేదని తేలింది. దాంతో ఆయన మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు తెరాస నేతతో సహా మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మాదాపూర్ డీసీపి వేంకటేశ్వరరావు స్వయంగా ఈవిషయం దృవీకరించారు. నిందితులను ప్రశ్నించిన తరువాత ఈకేసుకు సంబందించి పూర్తి వివరాలు తెలియజేస్తామని చెప్పారు. నిందితులలో ఒకడైన మహమ్మద్ ఉస్మాన్ ఖురేషీ తెరాస నేతకు రూ.45,000 చెల్లించి ఆ లేఖను సంపాదించినట్లు సమాచారం.