
మృత్యువు ఎవరిని ఎప్పుడు ఏ రూపంలో కాటేస్తుందో ఎవరికీ తెలియదు. అందుకు తాజా నిదర్శనంగా మెదక్ జిల్లా రామాయంపేట మండలం చల్మెడ గ్రామానికి చెందిన చిట్ల సురేశ్ (19) గురించి చెప్పుకోవలసి ఉంటుంది.
సిద్ధిపేట మండలం తోర్నాల శివారులో గల బీసీ హాస్టల్లో ఉంటూ స్థానిక ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ ప్రధమ సంవత్సరం చదువుకొంటున్నాడు. సోమవారం నుంచి సెమిస్టర్ పరీక్షలు జరుగనున్నందున స్నేహితుడు శ్రీనివాస్‌తో కలిసి సురేశ్ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు హాస్టల్ డాబాపైకి వెళ్ళి చదువుకొంటున్నాడు. అదే సమయంలో సమీపంలో కెనాల్ పనులలో భాగంగా బండరాళ్ళను జిలెటిన్ స్టిక్స్ పెట్టి పేల్చారు. ఆ ప్రేలుడులో ఒక పెద్ద రాయి తునక ఎగిరి వచ్చి సురేశ్ తలకు బలంగా తగలడంతో తలపగిలి తీవ్రరక్తస్రావంతో సురేశ్ అక్కడే చనిపోయాడు. అతని స్నేహితుడు శ్రీనివాస్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కొంతకాలం క్రితమే సురేశ్ తల్లి అనారోగ్యంతో చనిపోయింది. అయినప్పటికీ సురేశ్ నిరాశ చెందకుండా హాస్టల్లో చేరి పట్టుదలగా చదువుకొంటున్నాడు. సురేశ్ చనిపోయాడని తెలుసుకొన్న అతని తండ్రి, బందువులు షాక్ అయ్యారు. సమాచారం అందుకొన్న పోలీసులు అక్కడకు చేరుకొని సురేశ్ శవాన్ని పోస్ట్ మార్టం చేయించి అతని తండ్రికి అప్పగించారు. ఈ విషయం తెలుసుకొన్న సాగునీటిశాఖ మాజీమంత్రి హరీష్ రావు కూడా అక్కడకు చేరుకొని ప్రమాదం జరిగిన తీరు గురించి ప్రత్యక్ష సాక్షులను అడిగి తెలుసుకొన్నారు. సురేశ్ తండ్రిని ఆదుకొంటామని హామీ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్లన్నసాగర్ కాలువ పనుల కోసం బండరాళ్ళను బ్లాస్టింగ్ చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.