ఈసారి నాంపల్లిలో రాష్ట్ర అవతరణదినోత్సవ వేడుకలు

రాష్ట్ర అవతరణదినోత్సవ వేడుకలకు సమయం దగ్గర పడుతుండటంతో సిఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో శుక్రవారం అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొన్న విపరీతమైన ఎండ, వేడి, వడగాడ్పుల కారణంగా ఈసారి కొన్ని మార్పులు చేయాలని సిఎం కేసీఆర్‌ నిర్ణయించారు. స్కూలు విద్యార్దుల, పోలీసుల చేత కవాతులు నిర్వహించకూడదని సిఎం కేసీఆర్‌ నిర్ణయించారు. అదే కారణంగానే ఈసారి నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లోని జూబ్లీహాల్ ఎదురుగా ఉన్న మైదానంలో రాష్ట్ర అవతరణదినోత్సవ వేడుకలను నిర్వహించాలని నిర్ణయించారు. సుమారు 3-4 గంటల పాటుసాగే ఈ కార్యక్రమాలను గంటన్నరకు కుదించాలని నిర్ణయించారు. ఉదయం 9 గంటలకు పతాకావిష్కరణ, పోలీసుల గౌరవవందనం, ముఖ్య మంత్రి ఉపన్యాసంతో ఈ కార్యక్రమం ముగించాలని నిర్ణయించారు. ఆ తరువాత జూబ్లీహాలులో తెలంగాణ రాష్ట్రావతరణ అనే అంశంపై కవి సమ్మేళనం, ఎట్ హోమ్, సాయంత్రం అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించాలని నిర్ణయించారు. ఈసారి వేడుకలకు వివిద రంగాలలో ప్రముఖులను ఆహ్వానించాలని నిర్ణయించారు. 

స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం వంటి జాతీయ పండుగలలో ఆనవాయితీ ప్రకారం చేస్తున్న కార్యక్రమాలలో ఏమైనా మార్పులు చేర్పులు చేయవచ్చా? వాటిలో కొత్తగా ఏమైనా చేయవచ్చా లేదా? అనే విషయాలపై ఆలోచించవలసిందిగా సిఎం కేసీఆర్‌ అధికారులను కోరారు. వేడుకల పేరిట ప్రజలను, ముఖ్యంగా స్కూలు పిల్లలను, పోలీసులను ఇబ్బందిపెట్టకుండా అందరికీ సౌకర్యవంతంగా నిర్వహించుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు సిఎం కేసీఆర్‌ చెప్పారు.