హాజీపూర్ బాధితుల దీక్ష భగ్నం

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని హాజీపూర్ లో శ్రావణి, మనీషా, కల్పన అనే ముగ్గురు బాలికలను హత్య చేసిన సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డిని ఊరి తీయలంటూ బాధిత కుటుంబాలతో కలిసి గ్రామస్తులు చేస్తున్న ఆమరణ నిరాహారదీక్షను పోలీసులు శనివారం తెల్లవారుజామున 2 అర్ధరాత్రి భగ్నం చేశారు. వారినందరినీ అదుపులోకి తీసుకొని జవహార్ నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. శ్రీనివాస్ రెడ్డిని విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి అతనికి ఉరిశిక్ష విధించాలని, బాధిత కుటుంబాలు ఒక్కొక్కరికీ రూ.50 లక్షల నష్టపరిహారం, ఇంటిలో ప్రభుత్వోద్యోగం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వారి నిరాహార దీక్షలు 2వ రోజుకు చేరుకోవడంతో మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కనుక సమస్య మరింత పెరుగకుండా ఉండేందుకు పోలీసులు వారి దీక్ష భగ్నం చేశారు.