భారత్‌ జవాను కారణంగానే పుల్వామాలో జవాన్లు బలి!

పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు మృతి చెందినప్పుడు యావత్ దేశమూ తీవ్రఆగ్రహావేశాలకు లోనయింది. ఆ తరువాత కొన్ని రోజులకు మన వాయుసేన పాక్‌ భూభాగంలోకి ప్రవేశించి బాలాకోట్ లో ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసి మట్టుబెట్టింది. అయితే పుల్వామా ఉగ్రదాడిలో మన జవాన్లు బలైపోవడానికి కారణం మన జవానే అని తెలిస్తే షాక్ అవక మానము. 

ఇండోర్ సమీపంలోని మోహో పట్టణంలోని బీహార్ రెజిమెంట్‌లో క్లర్క్‌గా అవినాష్ కుమార్ (25)ను 2018లో అసోంకు బదిలీ అయ్యాడు. అతను పాక్‌ నిఘా సంస్థ ఐఎస్ఐ విసిరిన వలపు ఉచ్చులో చిక్కుకొని భద్రతాదళాల కదలికలకు సంబందించి వివరాలను పాక్‌ గూడఛారిణిగా భావిస్తున్న ఒక అమ్మాయికి అందజేసేవాడు. పరిచయం లేని సదరు మహిళ విసిరిన హనీ ట్రాప్‌లో చిక్కుకొని ఆమెతో సెక్స్ చాటింగ్ చేస్తూ ఎవరికీ తెలియకూడని రహస్యాలను ఆమెకు చెప్పేసేవాడు. అందుకు ప్రతిగా అవినాష్ కుమార్ బ్యాంక్ ఖాతాలో పాక్‌ నుంచి భారీగా డబ్బు జమా అయినట్లు కేంద్ర నిఘా సంస్థ, మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్‌(ఏటీఎస్‌) కలిసి చేసిన దర్యాప్తులో తేలింది. పుల్వామాలో భద్రతాదళాల కదలికల గురించి అవినాష్ కుమార్ ఇచ్చిన సమాచారాన్ని ఐఎస్ఐ సంస్థ జైష్ ఉగ్రవాద సంస్థకు అందజేయడంతో ఉగ్రవాదులు పక్కా ప్రణాళికతో పుల్వామాలో భారత్‌ సైనిక కాన్వాయ్ పై దాడులు చేసి 40 మంది జవాన్లను పొట్టన పెట్టుకొన్నారని దర్యాప్తు సంస్థలు కనుగొన్నాయి. మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ ఏటీఎస్ అధికారులు అవినాష్ కుమార్ ను అరెస్ట్ చేసి  భోపాల్‌లోని స్పెషల్ జిల్లా కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు అతనికి రెండువారాలు రిమాండ్ విధించింది.