
కరీంనగర్ జిల్లాలో కొత్తపల్లి మండలంలోని ఎలగందల గ్రామంలో చాలా విషాదకర ఘటన జరిగింది. గ్రామంలో ఇంటి ముందున్న చెట్టు క్రింద నిద్రిస్తున్న చిన్నారులపై నుంచి ట్రాక్టర్ వెళ్ళడం 7 సం.లు వయసు కలిగిన లక్ష్మీబాయి అనే పాప మరణించింది. ఆమె కవల సోదరుడు రాము (7) కూడా తీవ్రంగా గాయపడ్డాడు.
మహారాష్ట్రకు చెందిన యలప్ప, కమలవ్వ దంపతులు కొన్ని రోజుల క్రితమే కూలిపనుల కోసం ఎలగందలకు వలస వచ్చారు. ఈరోజు ఉదయం వారు తమ పిల్లలిద్దరికీ అన్నంపెట్టి ఇంటి ముందున్న చెట్టు క్రింద పడుకోబెట్టి కూలిపనులకు వెళ్లారు. చెట్టు క్రింద నిద్రిస్తున్న వారిని గమనించని ట్రాక్టర్ డ్రైవరు ట్రాక్టరును బయటకు తీసే ప్రయత్నంలో వెనక్కు తిప్పగా దాని చక్రాల క్రింద నలిగి లక్ష్మీబాయి చనిపోయింది. రాముకు కూడా తీవ్రంగా గాయపడినట్లు ప్రత్యక్షసాక్షులు చెప్పారు. అతనిని తక్షణమే జిల్లా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకొన్న పోలీసులు తక్షణమే అక్కడకు చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.