
మల్కాజ్గిరి మాజీ తెరాస ఎమ్మెల్యే కనకారెడ్డి (68) కనుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సికిందరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం కనుమూశారు. ఆయన సమైక్యరాష్ట్రంలో ద్రాక్ష రైతుల సంఘం అధ్యక్షుడుగా పనిచేశారు. మొదటిసారి 2009లో ప్రజారాజ్యం తరపున మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత తెరాసలో చేరి 2014 ఎన్నికలలో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి గెలిచారు. అనారోగ్యకారణంగా గత ఆరేడు నెలలుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
కనకారెడ్డి మృతి పట్ల సిఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి తదితరులు ఆసుపత్రికి వచ్చి ఆయనకు నివాళులు అర్పించి ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు.