
రాష్ట్రంలో రంగారెడ్డి, వరంగల్, నల్గొండ జిల్లాలలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు స్థానిక సంస్థల కోటాలో ఈ నెల 31వ తేదీన పోలింగ్ జరుగనుంది. నామినేషన్లు వేసేందుకు గడువు మే 14తో ముగియనుంది కనుక కాంగ్రెస్, తెరాస, బిజెపిలు తమతమ అభ్యర్ధుల పేర్లను నేడోరేపో ప్రకటించవచ్చు. సిఎం కేసీఆర్ కేరళ, తమిళనాడు రాష్ట్రాల పర్యటన ముగించుకొని శుక్రవారం రాత్రే హైదరాబాద్ తిరిగి చేరుకొన్నారు కనుక రేపు ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్ధుల పేర్లను ఖరారు చేయవచ్చునని సమాచారం. నల్గొండ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి, వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి నుంచి పట్నం మహేందర్ రెడ్డి పేర్లు దాదాపు ఖాయం చేసినట్లు సమాచారం.
ఇక కాంగ్రెస్ నేతలు కూడా ఎమ్మెల్సీ అభ్యర్ధుల పేర్లపై చర్చించేందుకు ఈరోజు గాంధీభవన్‌లో సమావేశమవుతున్నారు. ఈసారి అభ్యర్ధుల ఎంపిక విషయంలో జిల్లా అధ్యక్షులు సూచించినవారికే ప్రాధాన్యం ఇస్తామని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెపుతున్నారు. జిల్లా అధ్యక్షులతో మాట్లాడిన తరువాత రేపు కాంగ్రెస్ అభ్యర్ధుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. నామినేషన్లు గడువు దగ్గర పడుతున్నందున బిజెపి కూడా ఒకటి రెండు రోజులలో ఎమ్మెల్సీ అభ్యర్ధుల పేర్లను ప్రకటించకతప్పదు. టిడిపి, టిజేఎస్ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండబోతున్నట్లు సమాచారం. ఆ రెండుపార్టీలు కాంగ్రెస్ అభ్యర్ధులకు మద్దతు పలుకనున్నాయి.