కరీంనగర్‌వాసి వీరయ్యకు ఏడారి నుంచి విముక్తి

రెండేళ్ళుగా అబుదాబీలో షికాక్ అనే ఎడారి ప్రాంతంలో 100 ఒంటెలను ఒంటరిగా కాస్తూ దయనీయమైన జీవితం గడుపుతున్న కరీంనగర్‌వాసి వీరయ్య గోడు కేటీఆర్‌ చెవిన పడటంతో అదృష్టం ఫలించి ఆ ఏడారి నరకం నుంచి విముక్తి లభించబోతోంది. కేటీఆర్‌ విజ్ఞప్తి మేరకు విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ చొరవ తీసుకొని గట్టిగా ప్రయత్నించడంతో అతనిని తక్షణమే భారత్‌ తిరిగి పంపించేందుకు అబుదాబీ అధికారులు సదరు యజమానిని ఒప్పించారు. 

అబుదాబీ వెళ్ళి వీరయ్య దమ్మీడీ సంపాదించుకోలేకపోయినా రెండేళ్లపాటు ఎడారిలో నరకం అనుభవించి ఎట్టకేలకు ప్రాణాలతో ఆ నరకం నుంచి బయటపడగలుగుతున్నందుకు అదే పెద్ద అదృష్టమనుకొని త్వరలో కరీంనగర్‌కు తిరిగివస్తున్నాడు. అతని గోడు లోకానికి వినిపించింది కనుక బ్రతికి బయటపడ్డాడు కానీ గల్ఫ్ దేశాలలో ఈవిధంగా నరకం అనుభవిస్తున్నారెందరో ఉన్నారు. వారికి విముక్తి ఎప్పుడో? ముఖ్యంగా రాష్ట్రం నుంచి అరబ్బుల ఇళ్ళలో పనిచేయడానికి వెళ్ళిన మహిళల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంటుంది. వారి భద్రతకు తెలంగాణ ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకొంటే బాగుంటుంది.