సారీ...మాకా ఉద్దేశ్యం లేదు: సుప్రీంకోర్టు

ఈవీఎంలు ట్యాంపరింగ్ అవుతున్నాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్న దేశంలో 21 పార్టీలు ఈసారి లోక్‌సభ ఎన్నికలలో కనీసం 50 శాతం వివి ప్యాట్ రసీదులను లెక్కించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక రివ్యూ పిటిషన్‌ వేశాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం దానిపై నేడు విచారణ జరిపి, ఒకే ఒక నిమిషంలో క్లుప్తంగా తన అభిప్రాయం తెలిపి ముగించేసింది. “వివి ప్యాట్ రసీదులను లెక్కింపుపై గతంలో మేము ఇచ్చిన తీర్పును సవరించదలచుకోలేదు,” అని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. 

ఏప్రిల్ 8వ తేదీన ఇదే కేసులో సుప్రీంకోర్టు ఒక అసెంబ్లీ నియోజకవర్గంలోని 5 వివి ప్యాట్ స్లిప్పులను ఈవీఎంల నమోదైన ఓట్లతో పోల్చి చూడాలని ఆదేశించింది. ఆ తీర్పుకే కట్టుబడి ఉన్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో ప్రతిపక్షాలు తీవ్ర నిరాశ చెందాయి.