
తెలంగాణ సిఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా సోమవారం సాయంత్రం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో సమావేశమయ్యారు. జాతీయస్థాయి రాజకీయాలలో, ప్రభుత్వ వ్యవస్థలలో రావలసిన మార్పుల గురించి సిఎం కేసీఆర్ వెలిబుచ్చిన అభిప్రాయాలు చాలా బాగున్నాయని సిఎం పినరయి విజయన్ మెచ్చుకొన్నారని మీడియాలో వార్తలు వచ్చాయి తప్ప సమావేశం అనంతరం వారిరువురూ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు.
కేరళలో ప్రస్తుతం అధికారంలో ఉన్న వామపక్ష ఫ్రంట్ ఇటువంటి విషయాలలో తెరాసలాగ స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేదు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో దాని రాజకీయ ప్రయోజనాలు, సమీకరణాలు అన్నీ సరిచూసుకొని నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది కనుక ఫెడరల్ ఫ్రంట్‌లో చేరడంపై సిపిఎం పార్టీ అధిష్టానంతో చర్చించి నిర్ణయం తీసుకొంటామని చెప్పినట్లు సమాచారం. కానీ తెలంగాణలో సిపిఎం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోంది. సిపిఐ, సిపిఎం రెండు పార్టీలు కూడా తెరాస సర్కారును, కేసీఆర్ నిరంకుశవైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కనుక రాష్ట్ర స్థాయిలో బద్ద శత్రువులుగా ఉంటూ జాతీయస్థాయిలో కలిసిపనిచేయడం సాధ్యమేనా అంటే అనుమానమే. తమిళనాడులోని డిఎంకె, కర్ణాటకలోని జెడిఎస్ రెండూ కూడా కాంగ్రెస్ పార్టీతోనే కలిసి సాగుతామని ఇప్పటికే స్పష్టం చేశాయి. అయినా సిఎం కేసీఆర్ కేరళ, చెన్నై, బెంగళూరు వెళ్ళి వారితో భేటీ అవ్వాలనుకోవడం ఆలోచించవలసిన విషయమే. లోక్‌సభ ఎన్నికల ఫలితాలను బట్టి దేశంలో అన్ని ప్రాంతీయ పార్టీలు ముందుగా ప్రకటించిన తమ వైఖరిని మార్చుకొనే అవకాశం ఉందని సిఎం కేసీఆర్ బలంగా నమ్ముతున్నందునే కాంగ్రెస్ మిత్రపక్షాలను, తెరాసను వ్యతిరేకిస్తున్న వామపక్షాలను కలిసేందుకు వెళుతున్నారేమో?