ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ జారీ

రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాలో రంగారెడ్డి, వరంగల్, నల్గొండ జిల్లాలలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. స్థానిక సంస్థల కోటాలో జరుగనున్న ఈ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్‌ విడుదలవుతుంది. నేటి నుంచి ఈ నెల 14వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈనెల 31వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ 3వ తేదీన ఓట్లు లెక్కించి అదే రోజున ఫలితాలు ప్రకటిస్తారు.  

ఈ మూడు స్థానాలకు తెరాస అధినేత కేసీఆర్‌ ఇప్పటికే అభ్యర్ధుల పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం. నల్గొండ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి, వరంగల్ నుంచి తెరాస కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి నుంచి పట్నం మహేందర్ రెడ్డి పేర్లు ఖరారు చేసినట్లు సమాచారం. 

కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన పట్నం నరేందర్ రెడ్డి, మునుగోడు నుంచి పోటీ చేసి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వరంగల్ నుంచి కొండా మురళీధర్ రావు ముగ్గురూ తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేయడంతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. 

ప్రతిపక్ష పార్టీలు ఇంకా తమ అభ్యర్ధులను ఖరారు చేయవలసి ఉంది. నేడే ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడుతున్నందున ఒకటి రెండు రోజులలో అన్ని పార్టీలు తమ అభ్యర్ధులను ప్రకటించవచ్చు.