
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా ఇటీవల తెరాసలో చేరిన ఇల్లెందు కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీప్రియ శనివారం ఉదయం ఖమ్మం జిల్లాలో కామేపల్లి మండలం గోవింద్రాల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు ఆమెను అడ్డుకొని 'గో బ్యాక్' అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున తెరాసతో పోటీ చేసి గెలిచి మళ్ళీ అదే తెరాసలో చేరిపోయినందుకు వారు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె కోసం తామంతా ఎంతో కష్టపడి ప్రచారం చేసి ప్రజల మద్దతు కూడగట్టి గెలిపించుకొంటే, ఆమె తమ అభిప్రాయాన్ని, శ్రమను గౌరవించకుండా తెరాసలో చేరిపోయారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె తమ గ్రామంలో అడుగుపెట్టే హక్కు కోల్పోయారని వాదించారు. ఆవేశం పట్టలేక కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ఆమె వాహనంపై చెప్పులు, రాళ్ళు విసరడంతో ఆమె వెంట ఉన్న తెరాస కార్యకర్తలు కూడా ఎదురుదాడి చేశారు. ఈ దాడులలో ఇరువర్గాలకు గాయాలయ్యాయి. ఆ సమయంలో పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ ఆవేశంతో పరస్పరం దాడులు చేసుకొంటున్న ఇరువర్గాలను అదుపు చేయలేకపోయారు. దాంతో హరిప్రియ అర్ధాంతరంగా తన ప్రచారం ముగించుకొని వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు.