
సీనియర్ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శుక్రవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో 25 మంది ఇంటర్ విద్యార్దులు ఆత్మహత్యలు చేసుకొంటే సిఎం కేసీఆర్ కనీసం స్పందించలేదు. మృతుల కుటుంబాలలో ఏ ఒక్కరినీ పరామర్శించలేదు. ఆయనకు మా పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలుపై ఉన్న శ్రద్ద విద్యావ్యవస్థపై, విద్యార్దులపై లేదు. ఐదేళ్ళ కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో విద్యావ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది.
ఇంటర్ బోర్డులో అన్ని అవకతవకలు జరిగినా బోర్డు కార్యదర్శి అశోక్, గ్లోబరీనా సంస్థపై ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇంటర్ పరీక్షలనే సక్రమంగా నిర్వహించలేని ముఖ్యమంత్రి దేశానికి ప్రధానమంత్రి అవుదామని కలలు కంటున్నారు. గ్లోబరీనా సంస్థపై క్రిమినల్ కేసు నమోదు చేసి ఈ అవకతవకలకు కారకుడైన బోర్డు కార్యదర్శి అశోక్‌ను సస్పెండ్ చేయాలి. జగదీష్ రెడ్డి వంటి అసమర్దుడు విద్యాశాఖకు మంత్రిగా నియమింపబడటం వలననే ఇంటర్ బోర్డు పరిస్థితి ఈవిధంగా మారింది. ఆయన కూడా నైతికబాధ్యత వహిస్తూ తక్షణం రాజీనామా చేసి ఉండి ఉంటే హుందాగా ఉండేది. చనిపోయిన విద్యార్దుల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి,” అని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల హడావుడి మొదలవడంతో ఇంటర్ సమస్యను కాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రచారంలో కూడా లేవనెత్తి తెరాస ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం దామెరలో శుక్రవారం ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ప్రభుత్వం నిర్లక్ష్యం, అవినీతి కారణంగానే ఇంటర్ విద్యార్దులు బలైయ్యారు. విద్యార్దుల ఆత్మహత్యలకు కారణమైన తెరాసకు ప్రజలు ఎందుకు ఓటు వేయాలి? తెరాసకు మళ్ళీ ఓట్లేసి గెలిపిస్తే మళ్ళీ ఇటువంటి సంఘటనలే పునరావృతం అయ్యే ప్రమాదం ఉంటుంది. కేసీఆర్ మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా స్థానం లేదు. కనుక మహిళలు తెరాసకు ఓటు వేయవలసిన అవసరం ఏమిటి?” అని ప్రశ్నించారు.