
హైదరాబాద్‌లో మాదకద్రవ్యాల సరఫరా, వినియోగాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ఎంతగా కృషి చేస్తున్నప్పటికీ ఎక్కడో అక్కడ గుట్టుగా సాగుతూనే ఉన్నాయి. ‘పోలీసుల కళ్ళుగప్పి అనేక వ్యయప్రయాసలకోర్చి ఎక్కడి నుంచో కష్టపడి దొంగచాటుగా మాదకద్రవ్యాలను నగరంలోకి రవాణా చేయడమెందుకు... హైదరాబాద్‌లోనే తయారుచేస్తేనే బెటర్’ అని అనుకొన్నట్లున్నారు వాటిని తయారుచేస్తున్నవారు. దాంతో వారు ఏకంగా నాచారం పారిశ్రామికవాడలోనే ‘ఇన్‌కెమ్ ల్యాబొరేటరీ’ పేరుతో ఒక మాదకద్రవ్యాల తయారీ ప్లాంటును పెట్టేశారు.
పారిశ్రామికవాడలో రకరకాల పరిశ్రమలు ఉంటాయి కనుక అది కూడా ఏదో కెమికల్ ప్లాంట్ అనే అందరూ అనుకొన్నారు తప్ప నిషేదిత కేటమిన్ అనే భయానకమైన మాదకద్రవ్యం తయారు చేస్తున్న ప్లాంట్ అని ఎవరూ అనుమానించలేదు. రాష్ట్ర పరిశ్రమల శాఖ, ఎక్సైజ్ శాఖ, కార్మిక శాఖ, తూనికల కొలతల శాఖ, ఆ ప్లాంటుకు విద్యుత్ సరఫరా చేస్తున్న విద్యుత్ శాఖ, చివరికి రాష్ట్ర కాలుష్య నివారణ మండలిలో అధికారులెవరికీ ఆ ప్లాంటు కార్యకలాపాలపై అనుమానం రాకపోవడాన్ని ఏమనుకోవాలో అర్ధం కాదు.
తీగలాగితే డొంక కదిలినట్లు కర్ణాటక మాదక ద్రవ్యాల నియంత్రణ మండలి అధికారులు బెంగళూరులో యాదృచ్ఛికంగా తనికీలు జరుపుతున్నప్పుడు ఒక వాహనంలో తరలిస్తున్న బియ్యం బస్తాలో 26.750 కిలోల నిషేదిత కేటమిన్ పౌడరు ప్యాకెట్లను కనుగొన్నారు. అతనిని అదుపులో తీసుకొని ప్రశ్నిస్తే బెంగళూరులోని కెంగేరి, హైదరాబాద్ నాచారంలో ఇది తయారవుతోందని చెప్పడంతో ఈ విషయం బయటపడింది. ఒకవేళ అతను ఆరోజు పట్టుబడక పోయుంటే నేటికీ నాచారంలో మాదకద్రవ్యాల కంపెనీ కెమికల్ కంపెనీగానే చలామణి అవుతుండేదని వేరే చెప్పక్కరలేదు.
కర్ణాటక మాదక ద్రవ్యాల నియంత్రణ మండలి అధికారులు ఏపీ, తెలంగాణ అధికారులను కూడా అప్రమత్తం చేయడంతో మూడు రాష్ట్రాల అధికారులు కలిసి నాచారంలోని ‘ఇన్‌కెమ్ ల్యాబొరేటరీ’ దాడి చేసి సోదాలు చేయగా అక్కడ లభించిన భారీగా నిలువచేసిన ముడిసరుకు, అత్యాధునిక లేబొరేటరీ, యంత్రాలను చూసి వారు సైతం నివ్వెరపోయారు. వాటినన్నిటినీ స్వాధీనం చేసుకొని ఆ ప్లాంటును సీజ్ చేసి, ప్లాంట్ నడిపిస్తున్నవారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆ ప్లాంటులో ‘డేట్ డ్రగ్’ లేదా ‘క్లబ్ డ్రగ్’గా పిలువబడే కేటమిన్ అనే మాదకద్రవ్యాన్ని తయారుచేస్తున్నట్లు కనుగొన్నారు.
చిన్న మాత్రల రూపంలో ఉండే వాటిని ఎక్కువగా నగరంలో, దేశంలో ఇతర రాష్ట్రాలలోని పబ్బులకు సరఫరా చేస్తుంటారు. మద్యం కంటే తీవ్ర ప్రభావం చూపే ఈ మాత్ర ఒకటి వేసుకొన్నవారు ఏదో తెలియని భ్రాంతిలోకి వెళతారు. సుమారు 4-5 గంటల పాటు మత్తులో ఉండి ఏమి చేస్తున్నారో తెలియని స్థితిలో ఉంటారు. ముఖ్యంగా ఆ సమయంలో ఎవరు ఏమి చేసినా స్పందించలేని నిస్సహాయస్థితిలో ఉంటారు. కనుక పబ్బులలో ఇది సేవించే యువతులకు ఏమి జరుగుతుందో తేలికగానే ఊహించుకోవచ్చు. యాదృచ్ఛికంగా జరిపిన సోదాలలోనైనా నాచారంలో ఈ ‘ఇన్‌కెమ్ ల్యాబొరేటరీ’ గుట్టు బయటపడింది లేకుంటే ఇంకెన్నాళ్ళు సాగేదో ఎంత మంది బలైయ్యేవారో?