గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ నేతల దీక్ష

ఇంటర్మీడియెట్ బోర్డులో జరిగిన అవకతవకలకు భాద్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ అధ్వర్యంలో  (ఎన్‌ఎస్‌యూఐ) విద్యార్ధి సంఘం నేతలు గాంధీభవన్‌లో గురువారం నుంచి 48 గంటలపాటు నిరసన దీక్ష మొదలుపెట్టారు. తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి, సీనియర్ నేతలు వి.హనుమంతరావు, రాములునాయక్, ఇందిరా శోభన్, సతీశ్‌ మాదిగ, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు నేరెళ్ల శారద తదితర సీనియర్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ వైస్‌ చైర్మన్‌ కోదండరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “ఇంటర్మీడియట్‌ బోర్డు నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో 23 మంది విద్యార్దులు ప్రాణాలు కోల్పోయారు. 3.28 లక్షల మంది విద్యార్దుల భవిష్యత్ ఆగమ్యగోచరంగా మారింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు బాధ్యులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇదేమిటని ప్రశ్నించే ప్రతిపక్షాలను, విద్యార్దుల గొంతులను పోలీసుల చేత అణచివేయిస్తోంది. విద్యార్దులకు న్యాయం జరిగేవరకు మా పోరాటం ఆగదు,” అని అన్నారు. 

రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ, “దొంగ చేతికే తాళం ఇచ్చినట్లు ఇంటర్మీడియట్‌ ఫలితాలలో ఇంత గందరగోళం ఏర్పడటానికి కారణమైన గ్లోబరీనా సంస్థకే మళ్ళీ రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్ బాధ్యతలు అప్పగించడం చాలా విడ్డూరంగా ఉంది. ఇంటర్ బోర్డులో అవకతవకలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను ఎందుకు బహిర్గతం చేయడం లేదు?     గ్లోబరీనాపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం దానిని కాపాడే ప్రయత్నం చేస్తోంది. ఇంటర్ బోర్డులో అవకతవకలు జరిగాయని నేను నిరూపించడానికి సిద్దం. ప్రభుత్వం తరపున దీనిపై ఎవరైనా చర్చకు ముందుకురాగలరా?” అని సవాలు విసిరారు.