ఇంటర్ పాపానికి కేటీఆరే బాధ్యులు: రేవంత్‌

ఇంటర్ బోర్డులో జరిగిన అవకతవకలపై అధికార, ప్రతిపక్ష నేతల మద్య మాటల యుద్ధం మొదలైంది. ఇంటర్ బోర్డుకు సేవలందించిన గ్లోబరీనా సంస్థ పేరు తానెన్నడూ వినలేదని, అవకతవకలు జరిగిన తరువాతే అందరితోపాటు తాను కూడా గ్లోబరీనా పేరు విన్నానని, ఆ సంస్థతో తనకు ఎటువంటి సంబందమూ లేదని తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్న మాటలపై కాంగ్రెస్‌ నేతలు విరుచుకు పడుతున్నారు. 

కేటీఆర్‌ చెప్పింది నిజమే అయితే పెద్దమ్మ గుడిలో అమ్మవారి ముందు ప్రమాణం చేయాలని సీనియర్ కాంగ్రెస్‌ నేత వి.హనుమంతరావు సవాలు విసిరారు. 

కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి నిన్న గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “కేటీఆర్‌ ఐ‌టి మంత్రిగా ఉన్నప్పుడే ఆ సంస్థకు ఇంటర్ పరీక్షల బాధ్యత అప్పగించారు. గతంలో ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకేజీకి కారణమైన మ్యాగ్నటిక్‌ ఇన్ఫోటెక్‌ సంస్థపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఆ సంస్థ యాజమాన్యంతో కేటీఆర్‌కున్న సన్నిహిత పరిచయాలే. ఇప్పుడు గ్లోబరీనాపై చర్యలు తీసుకోకపోవడానికి కూడా కారణం అదే. ఆ రెండు సంస్థలు పైకి వేర్వేరుగా కనిపిస్తున్నా లోపల రెంటికీ సంబందం ఉంది. 

ప్రభుత్వానికి చెందిన ‘సెంటర్ ఫర్ గుడ్ గవర్నెస్’ గతంలో ఇంటర్ పరీక్షలను నిర్వహించినప్పుడు ఎటువంటి పొరపాట్లు జరుగలేదు కానీ ప్రైవేట్ సంస్థలకు అప్పగించిన తరువాతే ఇటువంటి సమస్యలు మొదలయ్యాయి. ఇటువంటి సేవలందించేందుకు మంచి అనుభవం, నేర్పు, సామర్ధ్యం అన్ని ఉన్న ప్రభుత్వం సంస్థను కాదని ప్రవేట్ సంస్థలకు పనులు ఎందుకు అప్పజెప్పుతున్నారు? అవకతవకలు జరిగిన తరువాత వాటికి బాధ్యులైన గ్లోబరీనా, మ్యాగ్నటిక్‌ ఇన్ఫోటెక్‌ ప్రైవేట్ సంస్థలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటే వాటికి కేటీఆర్‌ అభయహస్తం ఉన్నందునే. 

ఇంటర్ బోర్డు, గ్లోబరీనా, ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో 23 మంది ఇంటర్ విద్యార్దులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. వారి హత్యలకు అందరూ బాధ్యత వహించాలి. చనిపోయిన విద్యార్దులకు న్యాయం చేయాలి. ఇంటర్ అవకతవకలకు కారకులైన అందరిపై చర్యలు తీసుకోవాలి,” అని అన్నారు.