10.jpg)
వివిద అంశాలపై తక్షణమే స్పందించే తెరాస నేతలు ఇంటర్ అవకతవకలు, విద్యార్దుల ఆత్మహత్యలపై చాలా ఆచితూచి స్పందిస్తుండటం విశేషం. విద్యార్దులు, వారి తల్లితండ్రులు ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద రెండు రోజులు ఆందోళనలు చేసిన తరువాత విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించి త్రిసభ్య కమిటీ వేశారు. అయినప్పటికీ నానాటికీ విద్యార్దుల ఆందోళనలు, ఆత్మహత్యలు పెరిగిపోతుండటంతో సిఎం కేసీఆర్ స్పందించారు. ఆ తరువాతే ఎటువంటి ఫీజు, దరఖాస్తులు లేకుండా ఇంటర్ పత్రాల రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్ చేస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ ప్రకటించారు.
ఇంటర్ అవకతవకలకు కారణమైన గ్లోబరీనా సంస్థకు కేటీఆరే కాంట్రాక్ట్ ఇప్పించారని, అందుకే ఇంతజరుగుతున్నా ఆయన మౌనం వహిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తుండటంతో కేటీఆర్ కూడా ఈ సమస్యపై స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన ‘ఆస్క్ కేటీఆర్’ అనే పేరుతో ఆదివారం నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. వాటిలో నెటిజన్లు ఇంటర్ బోర్డు అవకతవకలు, గ్లోబరీనా సంస్థకు కాంట్రాక్ట్ కట్టబెట్టడం, విద్యార్దుల ఆత్మహత్యలపై ప్రధానంగా ప్రశ్నలు అడుగగా వారికి కేటీఆర్ సూటిగా సమాధానాలు చెప్పారు.
కేటీఆర్ ఏమి చెప్పారంటే, “ఇంటర్ బోర్డులో జరిగిన అవకతవకలపై కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా భాద్యులపై కటినమైన చర్యలు తీసుకొంటాము. గ్లోబరీనా సంస్థ పేరు నేను ఇదివరకు ఎన్నడూ వినలేదు. అవకతవకలు బయటపడిన తరువాతే నేను కూడా దాని పేరు విన్నాను. విద్యార్దులు ఆత్మహత్యలు చేసుకోవడం నాకు కూడా చాలా బాధ కలిగించింది. నేను కూడా తండ్రినే. ఒక తండ్రిగా వారి బాధను అర్ధం చేసుకోగలను. ఇంటర్ బోర్డులో అవకతవకలకు కారకులైనవారిపై ప్రభుత్వం చట్టపరంగా కటిన చర్యలు తీసుకొంటుందని నేను హామీ ఇస్తున్నాను,” అని చెప్పారు.
ఎటువంటి పదవి లేకపోయినప్పటికీ ప్రభుత్వ వ్యవహారాలలో ఎందుకు వేలు పెడుతున్నారని ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు, “ఒక ప్రజాప్రతినిధిగా ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను,” అని కేటీఆర్ సమాధానం చెప్పారు.