రాహుల్ విమానానికి మళ్ళీ సాంకేతిక సమస్య

లోక్‌సభ ఎన్నికలు ప్రచారం కోసం కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా విమానాలలో పర్యటిస్తున్నారు. శుక్రవారం ఉదయం డిల్లీ నుంచి విమానంలో పాట్నా బయలుదేరారు. కానీ బయలుదేరిన కొద్దిసేపటికే విమానం ఇంజనులో సాంకేతిక సమస్య ఏర్పడటంతో పైలట్ విమానాన్ని వెనక్కు మళ్లించి డిల్లీలో సురక్షితంగా దించారు. ఇవాళ్ళ రాహుల్ గాంధీ బిహార్ రాష్ట్రంలో సమస్తీపూర్, ఆ తరువాత ఒడిశాలోని బాలాసోర్, అక్కడి నుంచి మహారాష్ట్రలోని      సంగమ్నెర్‌లో జరుగబోయే బహిరంగసభలో పాల్గొనవలసి ఉంది. కానీ విమానం ఇంజనులో సాంకేతిక లోపం తలెత్తడంతో డిల్లీ తిరిగి వచ్చినందున, మూడు రాష్ట్రాలలో పాల్గొనవలసిన బహిరంగసభలకు కాస్త ఆలస్యంగా చేరుకొంటానని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఇప్పటికే బహిరంగసభలకు తరలివచ్చిన ప్రజలకు అసౌకర్యం కలిగించినందుకు చింతిస్తున్నాను,” అని ట్వీట్ చేశారు. 

గత ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి బయలుదేరినప్పుడు రాహుల్ గాంధీకి ఇంతకంటే భయానకమైన అనుభవం ఎదురైంది. ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడటంతో విమానం గాలిలో ఊగిపోయింది. కానీ పైలట్ చాలా ధైర్యంగా, చాకచక్యంగా నడిపించి తీసుకువచ్చి భద్రంగా క్రిందకు దించారు. రాహుల్ గాంధీ విమానప్రయాణాల భద్రతపై కాంగ్రెస్ పార్టీ కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంది.