ఆర్టీసీ బస్సు దొరికింది...కానీ సగమే

మంగళవారం రాత్రి గౌలిగూడ బస్ స్టాపు నుంచి మాయం అయిన టిఎస్ ఆర్టీసీ బస్సు దొరికింది కానీ ముక్కముక్కలుగా! ఆర్టీసీ బస్సు దొంగతనం అయినట్లు ఫిర్యాదు అందడంతో అఫ్జల్ గంజ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని, తెలంగాణలో చుట్టుపక్కల రాష్ట్రాలలో పాత బస్సులు, లారీలు తదితర భారీ వాహనాల భాగాలను విడదీసే మెకానిక్ షెడ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో కనుగొని ఆయా ప్రాంతాలలో పోలీసులను అప్రమత్తం చేశారు. వాటిలో నాందేడ్ కూడా ఒకటి.

గౌలిగూడా నుంచి దొంగిలించబడిన ఆర్టీసీ బస్సు బాసర మీదుగా నాందేడ్ వైపు వెళ్ళినట్లు గుర్తించడంతో పోలీసులు తక్షణమే అక్కడకు చేరుకొని ఆరా తీయగా నాందేడ్ సమీపంలోని కాంకిడి గ్రామంవైపు బస్సును తీసుకువెళ్ళినట్లు కనుగొని అక్కడకు చేరుకొన్నారు. కానీ అప్పటికే బస్సు బాడీని, సీట్లను అన్నిటినీ తొలగించేసి ఇంజను విడదీస్తున్నారు. పోలీసులు అక్కడున్న వారిని అరెస్ట్ చేసి దాదాపు తుక్కుగా మారిన బస్సును స్వాధీనం చేసుకొన్నారు.మహారాష్ట్రకు చెందిన ఫరూక్ ముఠా బస్సును దొంగతనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ ముఠా సభ్యులే మంగళవారం రాత్రి డ్రైవరు వెంకటేష్ బస్సును గౌలిగూడలో నిలిపి వెళ్ళిపోయిన తరువాత ఎత్తుకుపోయి నిజామాబాద్‌ మీదుగా నాందేడ్‌కు తరలించారు. అయితే నగరమంతటా ఏర్పాటు చేసిన సిసి కెమెరాలు, దారిలో టోల్ ప్లాజాల వద్ద ఉన్న సిసి కెమెరాలు బస్సు ఎటువైపు సాగిందో పోలీసులకు పట్టిచ్చాయి. బస్సు దొరికింది కానీ దానిని ఉపయోగించుకోలేని స్థితిలో ఉంది.