ఫెడరల్‌ ఫ్రంట్‌ ముఖ్యమా...విద్యార్దుల జీవితాలు ముఖ్యమా?

ఇంటర్ పరీక్ష ఫలితాలలో జరిగిన అవకతవకలను నిరసిస్తూ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు జిల్లాలలో కలెక్టరేట్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యపేటలో, విజయశాంతి వరంగల్‌లో, వి.హనుమంతరావు హైదరాబాద్‌లో, పొన్నాల లక్ష్మయ్య రంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేశారు. 

ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, “ఇంటర్ పరీక్ష ఫలితాలపై విద్యార్దులు, వారి తల్లితండ్రులు ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద నాలుగు రోజులుగా ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. 18 మంది విద్యార్దులు చనిపోయినా సిఎం కేసీఆర్‌కు చీమ కుట్టినంత బాధ కలుగలేదు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు గురించి ఆలోచిస్తున్నారు. ఆయనకు విద్యార్దుల జీవితాల కంటే ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటే ముఖ్యమా? సిఎం కేసీఆర్‌ తక్షణమే ఇంటర్ బోర్డులో అవకతావకలకు పాల్పడిన అధికారులపై కటిన చర్యలు తీసుకోవాలి. ఫెయిల్ అయిన విద్యార్దుల పేపర్లను రీ-కౌంటింగ్, రీ-వాల్యుయేషన్ చేయించాలి. చనిపోయిన విద్యార్దుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలి,” అని అన్నారు. 

వరంగల్‌లో విజయశాంతి మాట్లాడుతూ, “దొరా...నీకు ఎప్పుడూ రాజకీయాలే తప్ప ప్రజల బాగోగులు పట్టావా? 18 మంది విద్యార్దులు ఆత్మహత్యలు చేసుకొంటే ఏమాత్రం పట్టించుకోకుండా మా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో మునిగిపోయావు. ఒక్కొక్కరికీ 30 కోట్లు చెల్లించి కొనుకొంటున్నావు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంపై చూపుతున్న శ్రద్ద ఇంటర్ విద్యార్దుల జీవితాలపై లేదా? అని అడుగుతున్నాను. విద్యార్దులకు న్యాయం చేయమని మేము అడిగితే రాజకీయం చేస్తున్నామని మీ నేతలు ఆరోపిస్తారు. మేమిక్కడకి రాజకీయం చేయడానికి రాలేదు. విద్యార్దులకు న్యాయం చేయమని మిమ్మల్ని అడిగేందుకు వచ్చాము. విద్యార్దులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ మీ తరపున పోరాడుతూనే ఉంటుంది,” అని అన్నారు.

కాంగ్రెస్‌ నేతలు విద్యార్దుల కోసం రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయడం అభినందనీయమే. కానీ వారు మూడు రోజుల క్రితమే ఈ పని చేసి ఉంటే ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి ఉండేది. సిఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఇంటర్మీడియేట్ బోర్డు ఇప్పటికే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కనుక ఇప్పుడు వారి ధర్నాల వలన కొత్తగా ఒరిగేదేమీ ఉండదు. పోలీసులు విజయశాంతితో సహా కాంగ్రెస్‌ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు.