కొండాకు నాంపల్లి కోర్టు షాక్

చేవెళ్ళ కాంగ్రెస్‌ అభ్యర్ధి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. ముందస్తు బెయిల్‌ కోసం ఆయన తరపున న్యాయవాది దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. తక్షణమే పోలీసులకు లొంగిపోయి విచారణకు హాజరవ్వాలని ఆదేశించింది.     

రాష్ట్రంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఆయనకు నోటీస్ అందించడానికి వెళ్ళిన ఎస్ఐ, కానిస్టేబుల్‌ను నిర్బందించి, దూషించారని ఫిర్యాదు అందడంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి విచారణకు హాజరుకావలసిందిగా నోటీస్ పంపించారు. విచారణకు హాజరైతే అరెస్ట్ చేస్తారనే భయంతో కొండా విశ్వేశ్వర్ రెడ్డి గత వారం రోజులుగా అజ్ఞాతంలో ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు నాంపల్లి కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్‌ నిరాకరించడంతో పోలీసులకు లొంగిపోతారో లేదా హైకోర్టులో మళ్ళీ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేస్తారో చూడాలి. 

తెరాసలో ఉన్నంతకాలం ఎటువంటి విమర్శలు, ఆరోపణలు, ఇబ్బందులు లేకుండా చాలా హాయిగా గడిపిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెరాసను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరగానే కష్టాలు చుట్టుముట్టాయి. ఇవి కొని తెచ్చుకొన్న కష్టాలా లేక రాజకీయ కక్ష సాధింపులా...అనేది కాంగ్రెస్‌, తెరాస నేతలే చెప్పాలి.